Ganesh Nimajjanam | సిటీబ్యూరో, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): వినాయక నిమజ్జనం దగ్గర పడుతున్నది.. మరో పక్క 9వ రోజునే ఎక్కువ సంఖ్యలో నిమజ్జనాలు చేసేందుకు మండపాల నిర్వాహకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. 11వ రోజు నిమజ్జనం ఆలస్యమైతే మరుసటి రోజు పౌర్ణమి చంద్రగ్రహణం కూడా ఉండడంతో కొందరు ముందుగానే నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయాలని ఫ్లాన్ చేసుకుంటున్నారు.
మండపాల నిర్వాహకుల సన్నాహాలకు తగ్గట్టుగా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించే ట్యాంకుల వద్ద ఏర్పాట్లు పూర్తిస్థాయిలో కాలేదని మండపాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. 3,5,7,9వ రోజుల్లో ఎక్కువ సంఖ్యలో నిమజ్జనాలు జరిగితే 11వ రోజు సరైన సమయానికే నిమజ్జనాలు పూర్తవుతాయని కొందరు మండపాల నిర్వాహకులు భావిస్తున్నారు. ఇలా కొందరు గ్రహణం సెంటిమెంట్‌తో ముందుగానే నిమజ్జన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా, మరికొందరు మాత్రం వీకెండ్ శనివారం త్వరగా పూర్తి చేసుకుంటే సరిపోతుందనే భావనలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయా ట్యాంకుల వద్దకు వచ్చే విగ్రహలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సారి గణేశ్ నిమజ్జనానికి ప్రత్యేకత ఉంది. ప్రతి యేడు నిమజ్జనాలు మరుసటి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా జరిగేవి. కానీ ఈ సారి నిమజ్జనం మరుసటి రోజు ఆదివారం గ్రహణం ఉండడంతో శనివారం నాడే నిమజ్జనాలు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందంటూ మండపాల నిర్వాహకులు చర్చించుకుంటున్నారు. దీంతో తొమ్మిదో రోజు నిమజ్జనం నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయాలపై మండపాల నిర్వాహకులు చర్చించుకుంటున్నారు.
భారీ విగ్రహాలను ఆయా ట్యాంకులకు తరలించే రూట్లలో ఉన్న గుంతలు ఇంకా పూర్తిస్థాయిలో మరమ్మతులు జరగలేదు. మరో పక్క ఇటీవల విద్యుత్ తీగలతో పలు ప్రమాదాలు జరిగాయి. ఆయా రూట్లలో చెట్ల కొమ్మలు, వేలాడుతున్న తీగలను సరిచేయడం వంటి కార్యక్రమాలు కూడా పూర్తిస్థాయిలో జరగాల్సి ఉంది. 11వ రోజును దృష్టిలో పెట్టుకొని యంత్రాంగం పనులు నిర్వహిస్తుండడంతో మండపాల నిర్వాహకులు రెండు రోజుల ముందే ఎక్కువ మంది ప్రణాళికలు చేసుకుంటున్నారు. నిమజ్జనానికి రెండు మూడు రోజుల ముందే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సిద్ధంగా అధికార యంత్రాంగం ఉండాల్సినా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా యుద్ధప్రతిపాదికన నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని మండపాల నిర్వాహకులు కోరుతున్నారు.