గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు నగరం ముస్తాబవుతున్నది. వైవిధ్యభరితమైన రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు నలుమూలలా గణనాథులు కొలువుదీరనున్నారు. వినాయక చవితికి సమయం ఆసన్నమవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మట్టి విగ్రహాల పంపిణీ, వినియోగంపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. మట్టి విగ్రహాల విశిష్టతను ప్రజలకు వివరిస్తున్నది. మరోవైపు ఈ నెల 28న జరిగే నిమజ్జనానికి బల్దియా ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇందులోభాగంగా గ్రేటర్‌వ్యాప్తంగా 74 కోనేర్లను సిద్ధం చేశారు. గణేశ్ నిమజ్జనానికి 2వేల వాహనాలు సిద్ధం చేసిన ఆర్టీఏ..వాటిని 27న భాగ్యనగర ఉత్సవ కమిటీకి అందజేయనున్నది.
ఇదిలా ఉండగా, 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఖైరతాబాద్ గణేశుడు దశమహా విద్యాగణపతిగా ఈసారి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే విగ్రహ నిర్మాణం పూర్తవ్వగా.. తుది మెరుగులు దిద్దుతున్నారు. 15న నేత్రాలంకరణతో విగ్రహం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, 18న వినాయకచవితి సందర్భంగా ఉదయం తొలిపూజ, ప్రాణప్రతిష్ఠతో స్వామి వారి దర్శనం ప్రారంభమవుతుందని ఉత్సవ కమిటీ ప్రకటించింది. కాగా, బుధవారం హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో నిమజ్జన ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. బల్దియాలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో శుక్రవారం నుంచి 4 లక్షల మట్టి గణపతులను పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
69 సంవత్సరాలు.. 63 అడుగులు
ఖైరతాబాద్, సెప్టెంబర్ 13: దశ మహా విద్యాస్వరూపుడు దర్శనానికి ముస్తాబవుతున్నాడు. ప్రతి ఏడాది తీరొక్క రూపంలో దర్శనమిచ్చే స్వామి వారిని ఈ ఏడాది వైవిధ్యభరితమైన రూపంలో తీర్చిదిద్దారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఈ ఏడాది 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. ఈ సంవత్సరం మహాకాయుడు సరస్వతి, వారాహి అమ్మవార్లతో దశహస్తుడై దర్శనమిస్తున్నారు. అలాగే ఉప మండపాల్లో కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీనరసింహ స్వామి, ఎడమ వైపు శ్రీ వీరభద్ర స్వామిని ప్రతిష్టించారు. ఈ నెల 15న నేత్రాలంకరణతో విగ్రహం పూర్తి స్తాయిలో అందుబాటులోకి వస్తుందని, 18న వినాయక చవితి సందర్భంగా ఉదయం తొలిపూజ, ప్రాణప్రతిష్ఠతో స్వామి వారి దర్శనం ప్రారంభమవుతుందని ఉత్సవ కమిటీ ప్రకటించింది.
ప్రత్యేకతలు…
దశ మహా విద్యా గణపతికి అనేక ప్రత్యేకతలున్నాయి. స్వామి వారి విగ్రహ నమూనాను ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా రూపొందించారు. శిల్పి రాజేంద్రన్ పర్యవేక్షణలో, గ్రాఫిక్ డిజైనర్ శరత్ నల్లనాగుల విగ్రహానికి రూపకల్పన చేశారు. ఏడుపడగల ఆదిశేషుడి నీడలో దశ హస్తుడై మహాగణపతి దర్శనమిస్తారు. కుడివైపు అంకుశం, త్రిశూలం, ధాన్యం, రుద్రాక్ష, ఆశీర్వాదం, ఎడమ వైపు పాశం, ఖడ్గం, దారం, గ్రంథం, లడ్డూ, తొండంలో కలశం ధరించి ఉంటారు. స్వామి వారి వెనుక వైపు దశ మహాగ్రంథం, పాదాల వద్ద మూషికం ఉంటాయి.
విగ్రహ నిర్మాణానికి 120 మంది కళాకారులు..
63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు కలిగిన దశముఖుడి నిర్మాణం కోసం శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో 120 మంది కళాకారులు పనిచేశారు. విగ్రహ రూపకల్పనకు 20 టన్నుల నాణ్యమైన స్టీలును వాడారు. దీంతో పాటు 25 బండిళ్ల మెష్, రెండు డీసీఎంల వరి గడ్డి, 20 బస్తాల వరిపొట్టు, 500 కేజీల సుతిలి పొడి, రెండు ట్రాక్టర్ల ఇసుక, 2వేల మీటర్ల గోనె సంచులు, 25వేల మీటర్ల కోర బట్ట, 20 బస్తాల సున్నం పొడి, 50 కేజీల పెప్పర్ పొడి వినియోగించారు. విగ్రహ నిర్మాణానికి రాష్ట్రంలోని 15 మందితో పాటు చెన్నై నుంచి 30, ఒడిశా నుంచి 20, మహారాష్ట్ర నుంచి 20, పశ్చిమ బెంగాల్ నుంచి 15 మంది కళాకారులు, మరో 20 మంది పేయింటర్లు మూడు నెలల పాటు శ్రమించారు. విగ్రహం మొత్తానికి సహజమైన రంగులు వాడటం విశేషం.
గణేశ్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన
సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : వినాయక చవితి సందర్భంగా నెక్లెస్‌రోడ్డులో నిమజ్జన ఏర్పాట్లను బుధవారం పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. పీపుల్స్‌ప్లాజా, జలవిహార్ వద్ద వెహికల్ పార్కింగ్, బ్రిడ్జి 2, నెక్లెస్‌రోడ్డు ఖైరతాబాద్ పెద్ద గణేశ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో ట్రాఫిక్ అదనపు కమిషనర్ సుధీర్‌బాబు, విక్రమ్ సింగ్మాన్, జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రే, ఇఎన్సి జియాఉద్దీన్, జోనల్ ఎస్ఈ రత్నాకర్, హెచ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి, అదనపు కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, డీసీపీలు, అదనపు సీపీ, తదితరులు పాల్గొన్నారు.
భాగ్యనగర ఉత్సవ కమిటీకి 2వేల వాహనాలు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనానికి 2 వేల వాహనాలు ఆర్టీఏ అధికారులు సిద్ధం చేశారు. భాగ్యనగర ఉత్సవ కమిటీ కోరిన 15 వందల వాహనాల కంటే అధికంగా మరో 5 వందల వాహనాలను సమకూర్చడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే వాహనాలకు రీజనబుల్ ధరల పై ఆర్టీఏ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆపరేటర్లతో కలిసి చర్చించారు. ఈ నెల 27న ఆ వాహనాలన్నింటిని ఉత్సవ కమిటీకి అందజేస్తామని రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రవీణ్ రావు తెలిపారు. నిమజ్జనం ప్రక్రియ సాఫీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే వాహన అసోసియేషన్లతో వాహనాలు సమకూర్చడం పై చర్చలు పూర్తయ్యాయని వివరించారు.
ధూల్‌పేట్‌లో గణేశుల సందడి
అబిడ్స్, సెప్టెంబర్ 13: వినాయక చవితి సందర్భంగా ధూల్‌పేట్ పరిసర ప్రాంతాల నుంచి గణేశ్ ప్రతిమల తరలింపు కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ధూల్‌పేట్ పరిసర ప్రాంతాల్లో ప్రతిమలను తయారు చేసి విక్రయాలు చేపడుతారు. వేలాది విగ్రహాల తయారీ, విక్రయాలు జరుగుతాయి. నిత్యం ప్రతిమలను కొనుగోలు చేసేందుకు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలతో పాటు జిల్లాలకు చెందిన మండప నిర్వాహకులు సైతం వస్తున్నారు. 18న వినాయక చవితి కావడంతో దూర ప్రాంతాలకు చెందిన వారు ధూల్‌పేట్‌కు వచ్చి ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు. పెద్ద ప్రతిమలను వ్యాపారులు క్రేన్ల సహాయంతో లారీల్లోకి ఎక్కించి తరలిస్తున్నారు.
ఊపందుకున్న విక్రయాలు…
వినాయక చవితి సమీపిస్తుండటంతో ఇప్పటికే తయారైన వినాయక ప్రతిమలకు కళాకారులు తుది మెరుగులు దిద్ది విక్రయాలు చేపడుతున్నారు. పలు చోట్ల నుంచి ఉత్సవ నిర్వాహకులు ధూల్‌పేట్‌కు చేరుకుని ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. కళాకారులు తయారు చేసిన వినాయక ప్రతిమలను ధూల్‌పేట్ పరిసర ప్రాంతాల్లో షెడ్లను ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, వ్యాపారులు చర్యలు తీసుకుంటున్నారు.
వినాయక చవితికి ఏర్పాట్లు చేస్తాం
చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 13 : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని చార్మినార్ మున్సిపల్ జోనల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. బుధవారం నర్కీపూల్‌బాగ్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆయన శ్రీ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సౌత్ జోన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయక చవితి సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అభివృద్ధి పనులను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జోనల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ..దక్షిణ మండలం పరిధిలో వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావారణంలో జరుపుకునేలా మున్సిపల్ శాఖ తరఫున కృషి చేస్తామన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేశ్ ఉత్సవ సమితి భాగ్యనగర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు, ఉపాధ్యక్షుడు నర్సింగ్ పునియా కరోడిజీ, సౌత్‌జోన్ ప్రతినిధులు కౌడి మహేందర్, చర్మని రూప్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
గణపయ్యల నిమజ్జనానికి 74 చోట్ల కోనేరులు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): హుస్సేన్‌సాగర్, చెరువుల్లో పీఓపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో చేసిన రంగు విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. 30 సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న 28 కోనేరుల (బేబీ పాండ్స్)లతో పాటు అదనంగా మరో 46 ప్రాంతాల్లో తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంకులు(బేబీ పాండ్స్) ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. హుస్సేన్‌సాగర్ పై ఒత్తిడి తగ్గించేందుకు నగరంలో ఇప్పటికే 28 చోట్ల మినీ నిమజ్జన కొలనులను నాలుగేండ్ల కింద జీహెచ్ఎంసీ నిర్మించి విగ్రహాలను ఇక్కడే నిమజ్జనం చేస్తున్నారు. మూడు నుంచి ఐదు అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తున్న విగ్రహాలను ఈ కొలనుల్లో నిమజ్జనం చేస్తున్నారు. పోర్టబుల్ ట్యాంకుల నిర్మాణం విషయానికొస్తే 20మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 1.32 మీటర్ల లోతులో ట్యాంకులు ఉండనున్నాయి. పీవీపీ మెటీరియల్‌తో తయారు చేసే ట్యాంకుల ఏర్పాటు నుంచి నిమజ్జనం అనంతరం వాటి తొలగింపు వరకు సంబంధిత ఏజెన్సీలదే బాధ్యత ఉండనుంది. ఆరుగురు కార్మికులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఈ కొలనుల్లో 10 అడుగుల (మూడు మీటర్లకు మించని) ఎత్తున్న మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయనున్నారు. ఈ నెల 25వ తేదీ నాటికల్లా ఈ కోనేరులు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.
జోన్ నిమజ్జన కోనేరులు
ఎల్బీనగర్ : 13
చార్మినార్ : 11
ఖైరతాబాద్ : 12
శేరిలింగంపల్లి : 14
కూకట్పల్లి : 12
సికింద్రాబాద్ : 12
మొత్తం : 74