బండ్లగూడ, జనవరి 23 : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇటీవల రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర వాటి కోసం దరఖాస్తులు చేసుకున్న వారితో పాటు దరాఖాస్తు చేసుకునేందుకు వీలుగా అధికారులు గ్రామాల్లో గ్రామ సభులను ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వీటిని వార్డు కార్యాలయంలో గాని ఇతర ఖాళీ స్థలాల్లో నిర్వహించాలి. కానీ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజులుగా కిస్మత్పూర్, పిరం చెరువు, హైదర్షాకోట్ ప్రభుత్వ పాఠశాలల్లోనే గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా మండల విద్యాధికారితో పాటు స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు అనుమతులు తీసుకోవాలి.
కానీ అధికారులు తమ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ పాఠశాలలో టెంటు వేసి.. మైకులు పెట్టి విద్యార్థులకు ఆటంకం కలిగిస్తున్నారు. అదికూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సభలు నిర్వహిస్తున్నారు. అని గండిపేట మండల విద్యాధికారి విజయ్‌కుమార్ అన్నారు. కాగా, హైదర్షాకోట్లో జరిగిన గ్రామ సభలో మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత పాలనలో అవినీతి జరిగిందని చెప్పడంతో అక్కడే ఉన్న కార్పొరేటర్ సంతోషిరాజిరెడ్డి, డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డి ‘ఎవరు చేశారు అవినీతి.. ఇప్పుడే బయట పెట్టాలి’ అని చెప్పడంతో కొద్ది సేపు వాగ్వాదం జరిగింది.