కవాడిగూడ, మే 16: సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని అరుణోదయ సంస్కృతిక సమాక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమల, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాస్ట్ర నాయకులు వెంకటేశ్వర్రావు అన్నారు. సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్పెండింగ్ కేసుల బాధితుల ఆధ్వర్యంలో తమ న్యాయ మైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ బాధితుల సమస్యలు పరిష్కరించకపోవడంతో దరఖాస్తు చేసుకున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో ఉద్యోగాలు రాక, ఉపాధి మార్గం లేక ఇబ్బందులు పడుతున్న వారికి కుటుంబ పోషణ భారంగా మారిందని చెప్పారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అందాల పోటీలను నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి సింగరేణి మారుపేరు బాధితులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బాధితులు చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
బాధితులు శ్రవణ్, తిరుమల శ్రీనివాస్, సంతోస్, రంజిత్, ఓంప్రకాష్లు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా బెల్లంపల్లిలో పర్యటించిన సమయంలో సీఎం రేవంత్రెడ్డి తమ సమస్యలు పరిష్కరించి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. డిపెండింగ్ ఉద్యోగులు 1200 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని వారు కోరారు. లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.