మేడ్చల్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీల అనంతరం విజిలెన్స్ అధికారులు వివిధ రిజిస్ట్రేషన్ల దస్తావేజులపై ఆరా తీస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఇటీవలే కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి 20 మంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. విచారణలో డాక్యుమెంట్ రైటర్లు ఇచ్చిన వివరాలను ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఆ వివరాలతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. రెండు నెలల నుంచి సబ్ రిజిస్ట్రార్లు చేసిన దస్తావేజులపై ఆరా తీస్తున్నారు. దీంతో సిబ్బందితోపాటు సబ్ రిజిస్ట్రార్లు భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందుతుందోనన్న ఆందోళనలో సిబ్బంది, సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు?
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భూముల ధరలు కోట్లలో ఉన్న క్రమంలో నిషేధిత భూములు, నాలా కన్వర్షన్ కాని భూములను రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తున్నది. నాలా కన్వర్షన్ కాని భూములు తహశీల్దార్లు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నాలా కన్వర్షన్ కాని భూములు సబ్ రిజస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగినట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. మరోవైపు డ్యాక్మెంట్ రైటర్లు ఇచ్చిన వివరాలు, విజిలెన్స్ అధికారులకు ఉన్న సమాచారంతో నిషేధిత భూములు, నాలా కన్వర్షన్ కాని భూములు, తదితర వివరాల సేకరణలో విజిలెన్స్ అధికారులు బిజీగా ఉన్నారు. దీంతోపాటు రిజిస్ట్రేషన్‌కో రేటు పెట్టుకున్న సబ్ రిజిస్ట్రార్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ జరుగుతున్నది. విచారణ అనంతరం పలువురు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిపై వేటుపడే అవకాశముంది.
అన్ని రిజిస్ట్రేషన్లలో ఇదే తంతూ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్లలో రిజిస్ట్రేషన్ కో రేటు కొనసాగుతున్నది. జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి దస్తావేజు రిజిస్ట్రేషన్‌కు రూ.15 వేల నుంచి 30 వేల వరకు సబ్ రిజిస్ట్రార్ల ఆదేశాల మేరకు ప్రభుత్వ ఫీజలు కాకుండా, డాక్యుమెంట్ రైటర్లు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు కార్యాలయాలోని సిబ్బందిని సంప్రదిస్తే డాక్యుమెంట్ రైటర్లను కలవమని వారే సూచించడం గమనార్హం. డాక్యుమెంట్ రైటర్లను కలవనిదే ఒక్క రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితి. వారం రోజుల నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలో జరిగిన ఏసీబీ తనిఖీల్లో అనేక మంది డాక్యుమెంట్ రైటర్లను విచారించినా ఇప్పటి వరకు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
ఆదాయానికి మించిన ఆస్తులపై వివరాల సేకరణ
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే చిన్నస్థాయి అధికారుల నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ఆదాయానికి మించిన ఆస్తుల వివరాల సేకరణలో విజిలెన్స్ అధికారులు ఉన్నట్లు తెలుస్తున్నది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో అన్ని రకాలుగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ఫీజులు అధికంగా ఉన్న క్రమంలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కో రేటు ఫిక్స్ చేసిన నేపథ్యంలో ఆస్తులు కొనుగోలు చేస్తున్న వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.