సిటీబ్యూరో, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): తెలిసిన వారే మహిళలను వేధిస్తుండటం, చనువుగా ఉన్న సమయం లో తీసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై బాధితులు షీటీమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల రాచకొండ షీటీమ్స్‌కు పలు ఫిర్యాదులు రాగా.. ఆయా కేసులలో నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
కాగా, రాచకొండ షీ టీమ్స్ గత 15 రోజుల్లో 187 మంది పోకిరీలను పట్టుకుందని, వేధింపులకు భయపడకుండా ధైర్యంగా వచ్చి బాధితులు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూల్స్, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయి ఆపరేషన్లు చేస్తున్నట్లు సీపీ వివరించారు.
బాలికలు, వెంబడించి వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా రికార్డు చేస్తూ, వారిని పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నామన్నారు. పట్టుబడ్డ పోకిరీలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఇదిలాఉండగా.. పట్టుబడ్డ 187 మంది పోకిరీలకు ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయం(ఉమెన్ సేఫ్టీ ఆఫీస్)లో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు షీ టీమ్స్‌కు 217 ఫిర్యాదులు అందాయని తెలిపారు.
ప్రేమ పేరుతో మోసం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్
కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతికి అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. కొన్నాళ్లకు నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడుతూ వేధించడం మొదలు పెట్టాడు. ప్రేమకు ఒప్పుకోకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి అందరికీ పంపిస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు భయపడి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
స్థానికంగా ఉండే ఓ మహిళతో నిందితుడికి పరిచయం అయ్యింది. అప్పుడప్పుడు ఆమెతో మాట్లాడేవాడు. ఆ తరువాత ఆమె ఫోన్ నంబర్ తీసుకొని వేధించడం మొదలు పెట్టాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా వేధించడం, ఫోన్లో మాట్లాడకపోతే నీవు పనిచేసే వద్దకు వచ్చి వేధిస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
డిగ్రీ చదువుతున్న ఓ యువతిని ఆమె నివాసముండే ప్రాంతంలో నివాసముండే ఓ వ్యక్తి పరిచయం అయి, తరుచూ మాట్లాడుతుండేవాడు. అంతటితో ఆగకుండా నిన్ను ప్రేమిస్తున్నానంటూ నిందితుడు ఆ యువతిని వేధించడం మొదలు పెట్టాడు. లేదంటే నీ ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని, కాలేజీ వద్దకు వచ్చి గొడవ చేస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.