Hyderabad | వెంగళరావునగర్, మార్చి 12:ప్రేమించానని.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతి జీవితంతో చెలగాటమాడాడు ఆ వంచకుడు. ప్రియురాలిని శారీరకంగా పలుమార్లు కలిసిన ఆ మోసగాడు మరో యువతితో పెండ్లికి సిద్ధమై ప్రియురాలికి ముఖం చాటేశాడు ఆ ప్రియుడు. మోసపోయిన బాధిత యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల కథనం ప్రకారం.. మధురానగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో నివాసం ఉండే ఏపీకు చెందిన యువతి నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నది. బాపట్లలోని కాలేజ్లో చదువుకునే రోజుల్లో స్నేహితురాలు ఉండేది. రెండేళ్ల కిందట స్నేహితురాలి ద్వారా శ్రీహరి(28)అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా మారింది. ప్రేమిస్తున్నానని చెప్పడంతో అతడి ప్రేమను అంగీకరించింది.
పెండ్లి చేసుకుంటానని చెప్పిన ప్రియుడు ఓయోతోపాటు.. కాసా హోట ల్లో సన్నితంగా మెలిగారు. నెల కిందట వైజాగ్ వెళ్తున్నానని చెప్పి శ్రీహరి వెళ్లిపోయాడు. రెండు రోజుల కిందట నగరానికి వచ్చి ప్రియురాలిని కలిశాడు. తనని మర్చిపోవాలని.. సెల్ఫోన్లో ఓ అమ్మాయి ఫొటో చూపించాడు. ఇంట్లో వారు ఈ అమ్మాయితో పెండ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని, తనను మర్చిపోవాలని ప్రియురాలికి చెప్పాడు. ఫోన్లు చేసినా ప్రియుడు శ్రీహరి లిఫ్ట్ చేయడంలేదని.. తనను శారీరకంగా వాడుకుని వదిలేసి తన జీవితాన్ని ప్రియుడు నాశనం చేశాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.