సిటీబ్యూరో, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): ఫేస్బుక్లో కేరళకు సంబంధించిన లాటరీ యాడ్ చూసి క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.3.5లక్షలు కోల్పోయాడు ఓ వృద్ధుడు. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఫేస్బుక్ చూస్తున్నప్పుడు కేరళకు సంబంధించిన లాటరీ యాడ్ కనిపించింది. దీనిని చూసి క్లిక్ చేయగానే వాట్సాప్ లింక్ వచ్చింది. వెంటనే సైబర్మోసగాళ్లు బాధితుడిని సంప్రదించారు.
కేరళలో లాటరీ నడుస్తున్నదని, టికెట్లు కొంటే లాభాలు వచ్చే అవకాశముందని నమ్మించారు. దీంతో ఆయన మూడు టికెట్లు కొన్నారు. కొన్ని రోజుల తర్వాత మోసగాళ్లు బాధితుడికి ఫోన్ చేసి మూడు టికెట్లలో రెండుటికెట్లకు లాటరీ తగిలిందని, ఒకదానిపై రూ.5లక్షలు, మరొకదానిపై రూ.12లక్షలు వచ్చాయంటూ చెప్పారు. వేర్వేరు నంబర్ల ద్వారా బాధితుడిని సంప్రదించి రిఫండబుల్ ట్యాక్స్ కింద కొంత డబ్బు చెల్లిస్తే తప్ప డబ్బులు చేతికందవని చెప్పారు.
ట్యాక్స్ డబ్బులు లాటరీలో వచ్చిన డబ్బులతో కలిపి రిఫండ్ చేస్తారని నమ్మించారు. దీంతో బాధితుడు రూ.3,18,148లు ట్రాన్స్ఫర్ చేశారు. మరికొంత డబ్బు కావాలని నేరగాళ్లు డిమాండ్ చేయడంతో బాధితుడు ఒప్పుకోలేదు. తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.