Cyber Crime | సిటీబ్యూరో, ఏప్రిల్, 25(నమస్తే తెలంగాణ): అవకాడో ఫ్రూట్స్ లోడ్ పంపిస్తామంటూ ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని చివరకు రిపేర్లు, చలాన్లు, సొంత ఖర్చులంటూ రూ.2.6లక్షలు దోచేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్కు చెందిన 23 ఏళ్ల బాధితుడు జస్ట్ డయల్ యాప్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అవకాడోల కోసం వెతుకుతున్నప్పుడు విజయవాడకు చెందిన బాలాజీ ట్రేడర్స్ అనే వ్యక్తి అవకాడోలను సరఫరా చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో బాలాజీ ట్రేడర్స్కు చెందిన ప్రతినిధులు బాధితుడిని సంప్రదించారు.
స్కామర్లు అవకాడోలను డెలివరీ చేయడంలో భాగంగా ఫ్యుయెల్ ఖర్చులు అడగగా బాధితుడు ఒప్పుకున్నాడు. తర్వాత వెహికల్రిపేర్ అంటూ కొన్ని డబ్బులు, ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఆపేశారంటూ మరికొన్ని డబ్బులు కావాలంటూ అడగగా బాధితుడు చెల్లించాడు. ఈ నేపథ్యంలో స్కామర్ తన కుమారుడు గతంలో పంపిన డబ్బులు దుర్వినియోగం చేశాడని, వ్యక్తిగత అవసరాల నిమిత్తం కొన్ని డబ్బులు కావాలంటూ అడిగి జరిగిన దానికి తనను క్షమించాలని కోరి బాధితుడిని నమ్మించాడు.
బాధితుడి నమ్మకాన్ని పొందడానికి ఒక చెక్ ఫోటో పంపగాదానిని నమ్మి మళ్లీ డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇదంతా కేవలం అవకాడో ప్రూట్స్ లోడ్ తెస్తున్న పేరుతో స్కామర్ బాధితుడిని మోసం చేయడమే కాక, మరింత డబ్బు పంపాలంటూ బెదిరించాడు.ఈ విషయం తన తల్లిదండ్రులకు చెబితే ఏమంటారోనన్న భయంతో మొత్తం రూ.2.60లక్షలు పంపాడు. తాను మోసపోయిన విషయం సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.