Blood Banks | సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ధనార్జనే ధ్యేయంగా మానవత్వాన్ని మరిచి మనుషుల రక్తాన్ని కూడా వదలడం లేదు కొన్ని మాఫియాలు. ఈ క్రమంలోనే కొన్ని ముఠాలు సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని, అవినీతిని ఆసరాగా చేసుకుని మనుషుల రక్తంతో వ్యాపారం చేస్తూ, లక్షలు సంపాదిస్తున్నారు.
తక్కువ డబ్బులకు రక్తాన్ని సేకరించి, వాటి నుంచి ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు వంటి కాంపోనెంట్స్ను వేరు చేసి వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దవాఖానల్లో కొన ఊపిరితో ఉన్న రోగుల అవసరాలను ఆసరాగా చేసుకుని రెట్టింపు ధరలకు బ్లడ్ కాంపోనెంట్స్ను విక్రయిస్తున్నారు. అయితే ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు వంటి కాంపోనెంట్స్ను కూడా సరైన పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా తయారు చేసి రోగుల ప్రాణాలతో చలగాటమాడుతున్నాయి.
గతంలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ డీజీగా అకున్సభర్వాల్ పనిచేసిప్పుడు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే బ్లడ్ బ్యాంకులు, అనుమతులు లేని ఫార్మా కంపెనీలు, నిబంధనలు పాటించని మెడికల్ షాపులపై డీసీఏ అధికారులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆయన బదిలీ అయిన తరువాత దాదాపు మూడు, నాలుగేండ్లలో ఈ అక్రమాలను ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఆ మధ్య కాలంలో డీసీపీకి చెందిన అధికారులే కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. అయితే సదరు అధికారులకు తెలిసే ఇప్పుడు పట్టుబడుతున్న అక్రమాలు జరిగాయా? లేక ఆ అధికారులు నిర్లక్ష్యంతో విధులు నిర్వర్తించకపోవడం వల్ల ఈ అక్రమాలు కొనసాగుతూ వచ్చాయా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఔషధాల తయారీ, విక్రయాలు, బ్లడ్ కాంపోనెంట్స్ విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ఇంత కాలం మౌనంగా ఉంటూ ఇప్పుడు కొత్తబాస్ కొరడా ఝులిపించడంతో బలవంతంగా చర్యలకు పూనుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ముందుగా డీసీఏలో పనిచేస్తున్న అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రేటర్లో జరుగుతున్న అక్రమాలపై ఇంతకాలం దృష్టిపెట్టని అధికారులను జవాబుదారులుగా చేసి, చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.