Danam Nagender | బంజారాహిల్స్ ఫిబ్రవరి 8: కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారంటూ.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ బహిరంగంగా నిలదీశారు. ఇందుకు దానం బదులిస్తూ ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదంటూ అంగీకరించారు. శనివారం షేక్‌పేట మండలం పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కాలనీ డివిజల్లో లబ్ధిదారులకు ఫిలింనగర్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ కలగజేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు చెక్కులతోపాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ నిలదీశారు. దీంతో అక్కడున్న వారందరూ తులం బంగారం హామీపై దానంను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంగీకరించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ హామీ విషయాన్ని గుర్తు చేస్తానని సమాధానం ఇచ్చారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ డివిజన్ అంబేద్కర్ నగర్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు బస్తీల్లో 50 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న వారి జోలికి వెళ్ళొద్దని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భారతి నాయక్, వివిధ డివిజన్ల నేతలు మావిడి నర్సింగరావు, రాములు చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.