అబిడ్స్, డిసెంబర్ 23 : గోషామహల్‌లోని చాక్నావాడి ప్రాంతంలో నాలా పైకప్పు కుంగిపోయింది. అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు నాలాలో పడి ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. అఫ్జల్‌సాగర్ నుంచి మొదలైన నాలా ఆగాపుర, దారుసలాం, గోషామహల్, చాక్నావాడి, గోషామహల్ బరాదరి మీదుగా తోప్‌ఖానా, ఉస్మాన్‌గంజ్, కిషన్‌గంజ్, గౌలిగూడల నుంచి ఎంజీబీఎస్ మీదుగా మూసీలోకి చేరుతుంది. ఇదిలా ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నం గోషామహల్ చాక్నావాడి ప్రాంతంలో వారాంతపు సంత నిర్వహించేందుకు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమయంలో నాలా పైకప్పు పెద్ద శబ్ధంతో కుంగిపోయింది. దీంతో అక్కడ నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, వారాంతపు సంతకు తీసుకువచ్చిన తోపుడు బండ్లు నాలాలో పడిపోయాయి. వారాంతపు సంత కూరగాయలు, ఇతరత్రా సామగ్రి నాలాలో పడిపోయాయి. నాలా కూలడంతో వచ్చిన భారీ శబ్ధంతో భూకంపం వస్తుందన్న పుకార్లు షికార్లు చేశాయి.
కొంతసేపటి తర్వాత షాక్‌లోంచి తేరుకున్న ప్రజలు.. నాలా పైకప్పు కూలిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఎస్ఈ సహదేవ్ రత్నాకర్, ఈఈ ప్రకాశం, 14వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డీడీ నాయక్, గోషామహల్ ఏసీపీ ప్రదీప్, షాహినాయత్‌గంజ్ ఇన్స్పెక్టర్ అజయ్, గోషామహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి తదితర అధికారులతోపాటు గోషామహల్ కార్పొరేటర్ లాల్‌సింగ్, మాజీ కార్పొరేటర్లు ముఖేశ్‌సింగ్, పరమేశ్వరీ సింగ్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని నాలాను పరిశీలించారు. ఈ ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఆశిష్ కుమార్ యాదవ్, ఆల పురుషోత్తంరావు, సురేశ్ ముదిరాజ్, వినోద్ యాదవ్, జయశంకర్, రమేశ్ గుప్తా, ఆనంద్ సింగ్, పప్పు సింగ్ తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు.
ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు : మేయర్
గోషామహల్ సర్కిల్ చాక్నావాడిలో రోడ్డు కుంగిపోయిన సంఘటన స్థలాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని మేయర్ చెప్పారు. వ్యాపార కేంద్రం, ఎక్కువగా వాహనాలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే రోడ్డు కుంగిపోయిందని పేర్కొన్నారు. నాలాలో నుంచి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రవికిరణ్, ఎస్ఈ రత్నాకర్, డిప్యూటీ కమిషనర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నాలాను సందర్శించిన మంత్రి తలసాని
గోషామహల్ చాక్నావాడి ప్రాంతంలో నాలా పైకప్పు కుంగిపోవడంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాలాలో పడిపోయిన వాహనాలను తొలిగించి, నాలా రీ మోడలింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నాలాలపై నిర్మాణాలు చేపట్టడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన సమయంలో జన సాంద్రత లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించి నిబంధనలు పాటించాలన్నారు. మంత్రి వెంట నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, మాజీ కార్పొరేటర్లు ముఖేశ్ సింగ్, ఆశిష్‌కుమార్ యాదవ్, ఆనంద్ సింగ్ తదితరులు ఉన్నారు.
భారీ వాహనాలు వెళ్లడంవల్లే..
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. దాదాపు 40 ఏండ్లకు పైబడిన నాలాపై భారీ వాహనాల రాకపోకలు సాగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. నాలాను ఇంజినీరింగ్ నిపుణులు పరిశీలించి, రీ మోడల్ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్, మాజీ కార్పొరేటర్ ముఖేశ్‌సింగ్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరీసింగ్, బీఆర్ఎస్ నాయకులు బెజిని శ్రీనివాస్, వినోద్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
పాల్గొన్నారు.