సిటీబ్యూరో, జనవరి 31 ( నమస్తే తెలంగాణ ) : కొత్త బండి కొనాలనుకుంటున్నారా? అయితే మీ బ్యాంకు వివరాలు మాకు చెప్పాల్సిందే. ఖాతా వివరాలు చెప్పకపోతే మీ బండి రిజిస్ట్రేషన్ కాదు అంటూ షోరూంలు వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. బండి రిజిస్ట్రేషన్‌కు అడ్రస్ ఫ్రూవ్‌లు ఉంటే సరిపోతుంది కదా..బ్యాంక్ వివరాలు ఎందుకు అని వాహనదారులు ప్రశ్నిస్తే … ఆర్టీఏ రూల్స్ అలానే ఉన్నాయంటూ నిర్వాహకులు సమాధానమిస్తున్నారు.
ప్రస్తుతం కొనుగోలు అవుతున్న బండ్లు రిజిస్ట్రేషన్‌కు వాహనదారుల నుంచి బ్యాంక్ ఖాతా నంబర్లు తీసుకుంటున్నారు. అయితే ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకే ఆటోమెటిక్ డెబిట్ చేయడానికి బ్యాంక్ వివరాలు తీసుకుంటున్నారని వాహనదారులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షోరూంలకు బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వడంపై పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఓటీపీలు ప్రయివేట్ వ్యక్తులతో పంచుకోవాలని రవాణా శాఖ సూచించడం ఏంటని నిలదీస్తున్నారు.

షోరూంలపై నియంత్రణ ఏదీ?
ఇప్పటికే నగరంలోని పలు షోరూంలు ఇష్టానుసారంగా వివిధ పేర్లతో అత్యధిక చార్జీలు వేస్తూ డబ్బులు దండుకొంటున్నాయనే ఫిర్యాదులు ఆర్టీఏ కార్యాలయానికి అనేకం అందాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు షోరూంలకు నోటీసులు కూడా గతంలో అందించిన సంఘటను ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఇటీవల షోరూంలకే అప్పజెప్పడంతో ఇక షోరూంలు ఆడిందే ఆటగా మారుతున్నదని వాహనదారులు చెబుతున్నారు.
బండి కొనుగోలులో ఇన్సూరెన్స్, ఆర్టీఓ చార్జీలు, యాక్ససరీస్, పేరుతో ఇష్టానుసారంగా భారం మోపుతున్నారని చెబుతున్నారు. రవాణా శాఖ మోపిన సర్వీస్ చార్జీలు, లైఫ్ ట్యాక్స్ భారంతో చతికిలపడిన వాహనదారులకూ నగరంలో కొన్ని షోరూంలు ఇన్వాయిస్తో సంబంధం లేకుండా వాహనాలపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. సర్వీస్ ఛార్జీలు, హ్లాండ్లింగ్ పేరుతో రూ.10 వేల వరకు అధికంగా తీసుకుంటున్నారని వాహనదారులు చెబుతున్నారు. ఇలా చెల్లించిన డబ్బులు ఇన్వాయిస్లో ఉండడం లేదని అంటున్నారు. షోరూంలలో సేవల ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
సైబర్ క్రైం సంగతేందీ?
మీ బ్యాంకు ఖాతా నంబర్, లింక్ ఫోన్ నంబర్లు, ఓటీపీలు ఎవరికీ ఇవ్వొద్దని సైబర్ క్రైం పోలీసులు పదేపదే అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంక్ వివరాలు, ఓటీపీలు అన్నీ షోరూంలోని ప్రైవేట్ వ్యక్తులతో పంచుకోవడం ఎంత వరకు సేఫో అధికారులకే తెలియాల్సి ఉంది. తమ ఖాతా హ్యాక్ అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.