సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): మరుగుజ్జులు డ్రైవింగ్ చేయాలంటే వారికి అనుగుణంగా వాహనాలను మార్చాల్సి ఉంటుంది. అందులో భాగంగానే చాలా మంది మరుగుజ్జులు వారి డ్రైవింగ్ కల నెరవేరదేమోనని బాధపడుతుంటారు. కానీ వారు సైతం కారు, బైక్ నడపొచ్చు. వారి కలను రవాణా శాఖ నెరవేర్చుతున్నది. ఆర్టీఏ కల్పించిన వెసులుబాటుతో చాలా మంది తమ డ్రైవింగ్ కలను నిజం చేసుకుంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గ్రేటర్ వ్యాప్తంగా 120 రీ మోడలింగ్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
ఆర్టీఏ నిబంధనల ప్రకారం వాహనాలను వారికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు. దివ్యాంగులు తమ వాహనాల రిజిస్ట్రేషన్లలో అనేక మినహాయింపులు కూడా పొందొచ్చు. జీఎస్టీతో పాటు లైఫ్ టాక్సీ కూడా వారు చెల్లించాల్సిన అవసరం లేదు. మొదటగా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి తనకు అనువుగా ఉన్న వెహికిల్‌ను ఎంపిక చేసుకోవాలి. కొటేషన్ తీసుకోవాలి. ఆన్లైన్లో దానికి సంబంధించి జీఎస్టీ ఐప్లె చేయాలి. వారంలో కేంద్రం నుంచి అనుమతి పత్రం వస్తుంది. దానిని తీసుకుని షోరూంకు వెళ్లి వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అప్పుడు వారికి జీఎస్టీ, లైఫ్ టాక్స్ మినహాయింపు వస్తుంది.
ఆ బండిని తీసుకుని నాంపల్లిలోని రవాణా శాఖ అనుమతి ఉన్న దక్కన్ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ గ్యారేజీ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఈ సంస్థకే రాష్ట్రంలో కార్లను రీమోడల్ చేసే అనుమతి ఉంది. వాళ్లు సదరు వ్యక్తికి అనుగూణంగా క్లచ్, బ్రేకులు, సీటింగ్ విధానాల్లో మార్పులు చేస్తారు. ఆ వ్యక్తితో ట్రయల్ చేయిస్తారు. ఇంకేమైనా మార్పులు ఉంటే మాడిఫికేషన్ చేస్తారు. అయితే ఈ లోపున అతడు డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన పీహెచ్సీ సర్టిఫికెట్ వివరాలను పరిశీలించిన అనంతరం ఆర్టీఓ లెర్నర్ లైసెన్స్ జారీ చేస్తారు.
లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని మాడిఫికేషన్ పూర్తయిన వాహనంతో రిజిస్ట్రేషన్‌కు సంబంధిత ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. వాహన పత్రాలు, జీఎస్టీ వివరాలు, రి మోడల్ వాహనం సర్టిఫికెట్స్, లెర్నర్ లైసెన్స్ పరిశీలించిన అనంతరం అతడి పేరుతో కారు రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. అనంతరం నిర్ణీత సమయంలోపున టెస్ట్ డ్రైవ్‌కు హాజరై డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారు. అయితే అతడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాన్ని మాత్రమే నడపాల్సి ఉంటుంది. మరే ఇతర వాహనం నడపకూడదు. అందుకు సంబంధించిన వివరాలన్నీ ఆర్టీఏ రికార్టుల్లో నిక్షిప్తం చేస్తామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.