సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): శరవేగంగా విస్తరిస్తున్న నగరానికి వాహన విస్పోటనం అత్యంత ప్రధాన సమస్యగా మారింది. లెక్కకు మించి వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణపై సర్కార్ దృష్టి పెట్టకపోవడంతో… నిత్యం ట్రాఫిక్ జామ్తో ప్రధాన జంక్షన్లలో వాహనదారులు గంటలతరబడి ఇరుక్కుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో మొబిలిటీ ప్రణాళికల ఆధునీకరణపై మాటలు చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా మొబిలిటీ ప్లానింగ్ పేరిట ముసాయిదా విడుదల చేసిన సర్కార్… ఏడాదిగా ప్రతిపాదనలను పట్టాలెక్కించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అధునాతన రవాణా ప్రణాళికలను కల్పించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. హెచ్ఎండీఏకు చెందిన ఉమ్టా ఆధ్వర్యంలో ఈ ప్రణాళికలు జరుగుతున్నాయి. అయితే ఈ విభాగం గడిచిన రెండేళ్లుగా చెప్పేవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.
గడపదాటని డ్రాఫ్ట్ ప్రతిపాదనలు
ఈ నేపథ్యంలో ఏడాది కిందట విడుదల చేసిన డ్రాఫ్ట్ ప్రతిపాదనలు కూడా కార్యాలయం గడప దాటలేదు. ముఖ్యంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అధునానత రవాణా సేవలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతున్నది. ముఖ్యంగా మెట్రో, ఎంఎంటీఎస్ వంటి మాస్ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థల ఆధునీకరణ అత్యంత కీలకం. కానీ గడిచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ చేపట్టిన మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణ ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కూడా భూసేకరణ ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది.
విధానాల రూపకల్పనలో ఉమ్టా జాప్యం
ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించి ఉన్న హైదరాబాద్ నగరానికి మోడ్రన్ ట్రాన్స్పోర్టేషన్ విధానాలను రూపొందించడంలో ఉమ్టా జాప్యం చేస్తోంది. కార్యరూపంలోకి తీసుకురావాల్సిన ప్రతిపాదనలను కూడా కాగితాలకే పరిమితం చేస్తోంది. దీంతోనే ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడం లేదనే విమర్శలు ఉన్నాయి. 2031 నాటికి నగర విస్తరణకు అనుగుణంగా 328కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులో ఉండాలని, బీఆర్టీఎస్ 153 కిలోమీటర్లు, ఎంఎంటీఎస్ 355 కిలోమీటర్లు, 13,200 కిలోమీటర్ల హైవే ఆధునీకరణతోపాటు, రైల్, రోడ్డు ఇంటర్సెక్షన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఆయా ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితమవ్వడం కాంగ్రెస్ నిర్లక్ష్యపు పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.