Hyderabad | జియాగూడ, ఏఫ్రిల్ 12 : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో గౌలిగూడలోని చారిత్రాత్మక రామ మందిరంలో, హనుమంతునికి మహా యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయోధ్య రామ మందిర ట్రస్టు సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యుడు రామ్ విలాస్ వేదాంతి, బీజేపీ ఎమ్మెల్సీ ఎం కొమురయ్య, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరామ, విశ్వహిందూ పరిషత్ నాయకులు లక్ష్మీనారాయణ, కుమారస్వామి, ఏం రామరాజులు హాజరయ్యారు.
ప్రత్యేక పూజల అనంతరం భారీ హనుమంతుని ప్రతిమను, ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రథంపై పెట్టి శోభ యాత్రను ప్రారంభించారు. ఈ శోభాయాత్రను రామ్ విలాస్ వేదాంతి జెండా ఊపి ప్రారంబించారు. ఈ శోభాయాత్రలకు నగర శివారు నలుమూలల నుండి పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు హాజరయ్యారు. జై హనుమాన్ జై జై హనుమాన్ అంటూ కాషాయ జెండాలు చేతపూని నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ఈ శోభాయాత్రను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొని యాత్రను పర్యవేక్షిస్తున్నారు. అగుగడుగునా భారీ పోలీస్ బలగాలతో శోభాయాత్ర ముందుకు సాగుతుంది.