సిటీబ్యూరో, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లో వీడియోలు చూడడం, ఇయర్ ఫోన్స్ వినియోగించడం వంటి పనులు ప్రమాదకరమైనవని, అలా చేసే వారి పై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హైదరాబాద్ సిటీపోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. మంగళవారం రోడ్డు భద్రతపై కీలక హెచ్చరికలు జారీ చేస్తూ సీపీ ట్వీట్ చేశారు.
వాహనాలు నడిపే సమయంలో మొబైల్ ఫోన్స్ చూడడం ప్రమాదకరమైనవని, అంతేకాకుండా శిక్షార్హమైనవని చెప్పా రు. ఆటోలు, క్యాబ్‌లు, టాక్సీలను నడుపుతున్న డ్రైవర్లు ఇటీవల ఎక్కువగా మొబైల్స్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, ఆ సమయంలో వారి దృష్టి రోడ్డుపై ఉండకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి నిర్లక్ష్యమైన చర్యలపై హైదరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, ఇప్పటికైనా ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగించకుండా ఉండాలన్నారు . డ్రైవర్లు, ప్రయాణికులు, రోడ్డుపై ప్రయాణించే ఇతరుల భద్రత ముఖ్యమైనదని, జీవితం కంటే ఏది పెద్దది కాదన్న సజ్జనార్, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, ప్రాణాలు కోల్పోవద్దన్నారు.