పాడిపంటలిచ్చే ధాన్యలక్ష్మి ఆ తల్లి.
శక్తియుక్తులను ప్రసాదించే ధైర్యలక్ష్మి ఆ కల్పవల్లి.
మనిషి బతుకును ఉన్నతంగా తీర్చిదిద్దే ధనలక్ష్మి ఆమె.
పాలనలో రాజ్యలక్ష్మి..
లాలనలో గృహలక్ష్మి..
ఇంటింటా సంతానలక్ష్మి..
ఇలా కొలిచిన రూపంలో కొలువైన మహాలక్ష్మి శ్రావణ మాసంలో వరలక్ష్మిగా అనుగ్రహిస్తుంటుంది.
కష్టం చేసే మనిషిని అంటిపెట్టుకొని ఉంటుంది.
ధర్మం పలికే వ్యక్తి వెంట నడుస్తుంది.
వైకుంఠనాథుడి పట్టమహిషి.. నిజాయతీ ఉన్న నెలవులో సదా కొలువై ఉంటానని మాట ఇచ్చింది. మనసున్న మంచి మనుషుల్ని కనిపెట్టుకొని ఉంటానన్నది. శ్రావణ శోభతో లోకమంతా అలరారుతున్న ఈ శుభవేళ.. మహాలక్ష్మి కోరినట్టు మన ఇంటిని తీర్చిదిద్దుకుందాం. ఆ తల్లిని మన ఇంట ఉండమని వేడుకుందాం.
లక్ష్మీదేవికి శ్రావణం అంటే ఎందుకంత ప్రీతి? ఐష్టెశ్వర్యాలకూ, నవ నిధులకూ మూలాధారమైన శ్రీదేవి ఈ మాసంలోనే ఆవిర్భవించింది. శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు.. పాలకడలి నుంచి వెలికి వచ్చింది. భృగు మహర్షి గారలపట్టిగా పుట్టింది. అందుకే, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించే సంప్రదాయం ఏర్పడింది.
వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే దేవి వరలక్ష్మి. ‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్ఠమైనది’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోరికలు, శ్రేష్ఠమైన కోరికలు తీర్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని సమంత్రకంగా, భక్తి భావనతో కొలిచే క్రతువే ‘వరలక్ష్మీ వ్రతం’.
స్కంద పురాణం ప్రకారం పరమేశ్వరుడు పార్వతికి వరలక్ష్మీ వ్రతం గురించి చెబుతాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా వివరించాడు. భర్తపట్ల ఆదరాన్నీ, అత్తమామలపై గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది.
అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వరలక్ష్మీ వ్రత ప్రసాదంగా అందుకుంటుంది. వరలక్ష్మీ వ్రతానికి ఓ ప్రత్యేకత ఉంది. శ్రావణ పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం సమీపంలో చంద్రుడు ఉంటాడు. శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం. పౌర్ణమి నాడు అమ్మవారు షోడశ కళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. వీటన్నిటినీ సమన్వయం చేస్తూ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తారు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు.
కష్టానికి ప్రతిఫలం లక్ష్మి. సంతోషాలకు ఆధారం ఆ శ్రీదేవే! సంతృప్తికి మూలం ఆవిడే!! మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురు చూస్తుంటుంది. అష్టలక్ష్ముల చూపుతో.. అష్టదరిద్రాలూ తీరిపోతాయని తహతహలాడుతుంటారు జనులు. ఆ తల్లి కరుణ అణువంత ప్రసరిస్తే చాలని ఆకాంక్షిస్తుంటారు. శ్రీహరి గుండెలపై కొలువై ఉన్న సంపదల సీమంతిని.. శ్రావణ దీప్తిగా, వరలక్ష్మిగా పూజలు అందుకునే కాలమిది. పూజలు, వ్రతాలు, నోములు చేయడంతో ఆ అమ్మ తప్పక సంతోషిస్తుంది! అదే సమయంలో మన నడత సక్రమంగా ఉంటే మరింత అనుగ్రహిస్తుంది.
‘శుద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ
‘శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా’ అన్నారు పెద్దలు. శుద్ధలక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది. శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు! అంతర్ శుద్ధి కూడా. సర్వకాలాల్లో బాహ్యంగా, మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. ఎన్నో సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పిందని పురాణ గాథ.
భీష్ముడి చెప్పిన మాట
లక్ష్మీదేవి ప్రస్తావన శాంతిపర్వంలో వస్తుంది. ‘లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది?’ అని భీష్ముడిని అడుగుతాడు ధర్మరాజు.‘జలాలు,పొలాలు, అగ్ని, వాయువు, గోవు, ఏనుగు కుంభస్థలం, ఇంటి గడప, పాపిటబొట్టు, సిందూరం, బంగారం, చల్లని వెన్నెలలో, సత్యం, దానం, వ్రతం, ధర్మం ఆచరించే చోట లక్ష్మి నివసిస్తుంది’ అని చెప్పిన భీష్ముడి సమాధానం లక్ష్మీదేవి తత్వాన్ని విశదపరుస్తుంది.