Vande Bharat | సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ రైలు సర్వీసులు పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారడంతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియర్ రైళ్లను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిచ్చినప్పటికీ టికెట్ ఛార్జీలతో పాటు ఫుడ్ క్యాటరింగ్ విషయంలో ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆహార పదార్థాలు చెత్తగా తయారు చేస్తున్నారు. ఈ రైలులో టికెట్ ధరలు అధికంగా ఉన్నాయనే విమర్శలు వస్తుండగా ఇప్పుడు ఆహార పదార్థాలు కూడా సరిగా లేవని ప్రయాణికులు అసంతృప్తి చేస్తున్నారు. ఐఆర్సీటీసీతో కలిసి రైల్వే శాఖ పేరుతో ప్రధానమంత్రి పక్కా కమర్షియల్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులు సౌకర్యం, సంక్షేమం సరిగా లేక పోయినప్పటికీ ప్రయాణికుల అవసరాలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణం చేసే వారికి సరఫరా చేస్తున్న ఆహారం రుచి పచి, శుచి శుభ్రత ఏమీ లేకుండా తయారు చేస్తున్నారు.
Vande Bharat1
ఐఆర్సీటీసీ సబ్ ఏజెంట్లకు బాధ్యతలు ఇచ్చి.. నాసిరకమైన ఆహారాన్ని తయారు చేయడంలో భాగస్వాములవుతున్నారు. కాంట్రాక్టర్లతో లోపాయి కార ఒప్పందాలు చేసుకూంటూ కమీషన్లు కొట్టేస్తున్నారు. ఏసీ కోచ్‌ల పేరుతో ఇడ్లీ, వడ, దోసే, పూరీ, సాంబారు, రైసుకు సంబంధించి ఆహార పదార్థాలను అందించడం లేదు. ఇలాంటి ఆహార పదార్థాలు అందించడం కష్టమని, వేడి వేడిగా తయారు చేయలేమన్న సాకుతో.. వందేభారత్ ప్రయాణికులందరికీ నార్త్ ఇండియన్‌కు సంబంధించిన కచోరి, ఆలు సమోసా, స్వీటు, చాక్లెట్, చీజ్‌తో తయారు చేసిన బ్రెడ్ ముక్కలు ఇలాంటివి అందిస్తున్నారు. పైగా అప్పటికప్పుడు తయారు చేసినవి కాకుండా.. 24 గంటల ముందు తయారు చేసి ప్లాస్టిక్ బాక్సులలో సీల్ చేసి ఉదయం స్నాక్స్, మధ్యాహ్నం లంచ్ పేరుతో అందిస్తున్నారు. పైగా షుగర్, బీపీ పేషెంట్లతో పాటు వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు వంటి వారికి అనుకూలంగా ఉండే ఫుడ్ వందేభారత్‌లో లభించడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వారంతా నార్త్ ఇండియన్ ఫుడ్‌ను తినలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయని, వాటిని తింటే బయటకే తప్ప నోట్లోకి పోవడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి.
Vande Bharat
ప్రస్తుతం తెలంగాణ, ఏపికి సంబంధించి రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం, రెండోది సికింద్రాబాద్-తిరుపతి. మరో నెల రెండు నెలల్లో కాచిగూడ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి ముంబాయికి కలిపి మరో రెండు వందేభారత్‌లు రాబోతున్నాయి. దీంతో దశల వారీగా మిగిలిన ప్రాంతాలకు కూడా వందేభారత్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే పరిస్థితులు ఉన్నాయి. అయితే వాటంన్నిటిలో కూడా సౌత్ ఇండియన్ ఫుడ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తున్నది. ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేసి, నాసిరకం పదార్థాలు తయారు చేసి, ప్రయాణికులపై రుద్దడాన్ని రైల్వే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్, మధుసూదన్‌తో పాటు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.