మేడ్చల్, నవంబర్16 (నమస్తే తెలంగాణ) : పట్టణ ప్రకృతి వనాలు చిట్టడవులను తలపిస్తున్నాయి. నగరశివారు ప్రాంతాలలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాల పచ్చందాలు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 217 పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఎకరం విస్తీర్ణంలోపు ఉన్న ప్రభుత్వ భూములలో పట్టణ ప్రకృతి వనాలను ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నది. ఏడో విడత హరితహారంలో పట్టణ ప్రకృతి వనాలలో 469540 మొక్కలను నాటినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలో బృహత్ ప్రకృతి వనాలు
జిల్లాలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 5 మండలాలల్లో బృహత్ పల్లె పకృతి వనాలను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి స్థలాలను ఎంపిక చేసి భూమి అభివృద్ధి పనులను పూర్తి చేసి మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రారంభించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలలో భూమి అభివృద్ధి మొక్కలు నాటించే కార్యక్రమాన్ని ఉపాధి హామీ కూలీలతో చేయిస్తూ వారికి పని దినాలను కల్పిస్తున్నారు.