దుండిగల్, ఫిబ్రవరి 3: హైదరాబాద్ సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అద్భుత ఘనత సాధించింది. దేశీయ సాంకేతికతతో రూపొందించిన ‘ఎస్ఎస్ఐ మంత్ర’ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌ను ఉపయోగించి అత్యంత సంక్లిష్టమైన 50కిపైగా రోబోటిక్ ఇంట్రా కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. తద్వా రా దక్షిణ, పశ్చిమ, తూర్పు భారతావనిలో ఈ ఘనత సాధించిన మొదటి వైద్యశాలగా నిలిచినట్టు హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు వివరాలను మంగళవారం ఆ వైద్యశాలలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఆధునిక సాంకేతికతతో తక్కువ ఖర్చుతో రోగులకు నాణ్యమైన శస్త్రచికిత్సలను అందించేందుకు కృషిచేస్తున్నామని హాస్పిటల్ చైర్మన్ సీహెచ్ భద్రారెడ్డి తెలిపారు. ఆధునిక టెక్నాలజీని పటిష్టమైన క్లినికల్ వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ వైద్యసేవలు అందజేయవచ్చని వైస్‌చైర్మన్ సీహెచ్ ప్రీతిరెడ్డి చెప్పారు. అనంతరం సర్జరీ ద్వారా కోలుకున్న రోగులతో కలిసి కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో సీటీవీఎస్ సీనియర్ కన్సల్టెంట్ హరీశ్ బాదామి, మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాకేశ్ ప్రభు పాల్గొన్నారు.