సిటీబ్యూరో, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కంలో నాలుగు నెలల కిందట జరిగిన బదిలీలలో ఏం జరిగింది. బదిలీ అయిన మొత్తం 30మంది విషయంలో పాత ఉన్నతాధికారి ఎందుకు విచారణకు ఆదేశించారు. అయినా ఈ రోజుకూ విజిలెన్స్‌కు విచారణ చేయాలంటూ నోట్‌ఫైల్‌పై రాసినా ఉత్తర్వులు మాత్రం సీవీవోకు ఎందుకు అందలేదు. నోట్‌ఫైల్‌లో పాత ఉన్నతాధికారి రాసిన రెండు అంశాలలో కేవలం ఒక్కటి మాత్రమే ప్రస్తుతం విజిలెన్స్ ఆఫీసర్‌కు చేరడం వెనక జరిగిందేమిటి.. ప్రస్తుతం టీజీఎస్పీడీసీఎల్లో ఉద్యోగుల మధ్య జరుగుతున్న చర్చ ఇది.
ఇప్పటికే పలు వ్యవహారాలతో దక్షిణ డిస్కం అభాసుపాలవుతుంటే తాజాగా గతంలో జరిగిన బదిలీల కుంభకోణం ఒకటి వెలుగుచూసింది. నాలుగునెలల కిందట జరిగిన బదిలీల వ్యవహారంలో చాలామంది ఇంజినీర్లకు ప్రమోషన్లు, బదిలీలు ఇచ్చారు. ఆ సమయంలో కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొందరు ఇంజినీర్లు తమకు ఇచ్చిన పోస్టింగ్‌లలో చేరలేదు. ఆ తర్వాత ఆ స్థానాల్లో వేరేవారు చేరడంతో ఆ స్థానాలకు పెద్ద ఎత్తున పైరవీలు చేసుకున్నవారు తమకెందుకు కాలేదంటూ లోతుగా పరిశోధించారు.
ఇందుకు ఆ విభాగానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులే ఉన్నతాధికారికి తెలియకుండా చేశారని తేలింది. దీనిపై విజిలెన్స్ విచారణ జరపాలంటూ అప్పట్లో పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వచ్చింది. కానీ విషయం బయటకు పొక్కనీయకుండా హెచ్ఆర్కు సంబంధించిన కొందరు ముఖ్యవ్యక్తులు మేనేజ్ చేశారంటూ ప్రస్తుతం డిస్కంలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆ బదిలీల తర్వాత మరోసారి 30మందికి అప్పటి ఉన్నతాధికారికి తెలియకుండానే పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ 30మంది విషయంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు మింట్‌కాంపౌండ్ కోడై కూస్తోంది.
ఆ అధికారి బదిలీ వెనక..!
ఇదిలా ఉంటే రెండు నెలల కిందట గతంలో పనిచేసిన ఉన్నతాధికారి బదిలీ కావడానికి ముందే ఈ అక్రమ బదిలీల విషయంలో లోతైన విచారణ జరిపించాలని, ఆ తర్వాత ప్రత్యేక కేసుల బదిలీలకు సంబంధించి కూడా ప్రతీ దరఖాస్తును విజిలెన్స్‌తో విచారణ జరిపించాకే పరిగణనలోకి తీసుకోవాలంటూ నోట్‌ఫైల్‌పై రాశారు. ఈ ఆదేశాలను హెచ్ఆర్ విభాగంలో ఓ అధికారి తొక్కిపట్టి ఆ నోట్‌ఫైల్‌లో ఉన్న మొదటి బదిలీలపై విచారణను కప్పిపెట్టి, రెండో అంశమైన ప్రత్యేక కేసులపై విజిలెన్స్ ఎంక్వైరీని ఉత్తర్వుల కింద ఇచ్చేలా చూశారు. దీంతో డిసెంబర్, జనవరి నెలల్లో జరిగిన బదిలీల విషయంలో ఏం కుంభకోణం దాగుందోనంటూ డిస్కంలో అధికారుల మధ్య చర్చ జరుగుతోంది.
ఈ బదిలీలలో ఫోకల్, నాన్‌ఫోకల్ పోస్టులు కూడా ఉండడంతో వాటికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరిగాయోనంటూ ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే బదిలీలకు సంబంధించిన విభాగంలో అవకతవకలపై బాధ్యుడిని చేస్తూ అప్పటి ఉన్నతస్థాయి వ్యక్తిని ఆనాటి ఉన్నతాధికారి ఆ బాధ్యతలనుంచి తొలగించి వేరొకరికి అప్పగించారు. అంతకుముందే సబ్ ఇంజినీర్ల నుంచి ఏఈలుగా ప్రమోషన్లు, బదిలీల వ్యవహారంలో కొందరు ఏఈలు, ఏడీఈలకు సంబంధించిన విషయంలో బదిలీలపై తీసుకున్న నిర్ణయాలు అప్పటి ఉన్నతాధికారికి తెలియకుండానే చేశారని చెప్పుకొంటున్నారు.
సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెప్పిన వ్యక్తుల బదిలీలకు కూడా ఏవో ఒక సాకులు చూపి చేయకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ ఉన్నతస్థాయి వ్యక్తి అంతా తానే అయి బదిలీలు చేయడం వివాదాస్పదమైంది. ఎవరికైతే బదిలీలు కాలేదో వారంతా డిప్యూటీ సీఎం దృష్టికి కూడా ఈ ముచ్చట తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం వెలుగుచూడడంతో అప్పటి ఉన్నతాధికారి విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ నోట్‌ఫైల్ పెట్టారు. కానీ ఆ ఆదేశాలు విజిలెన్స్ విభాగానికి రాకుండా హెచ్ఆర్లోనే మేనేజ్ చేశారంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆ తర్వాత రెండునెలలకు కొత్త అధికారి వచ్చిన తర్వాత పాత ఉన్నతస్థాయి వ్యక్తి అతనికి దగ్గరవడంతో మళ్లీ ఈ విభాగంపై చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అయితే ఈ విచారణకు సంబంధించి ఆనోటాఈనోటా బయటకు పొక్కడంతో అక్కడ కీలకంగా బదిలీలలో కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కీలక అధికారిని వేరొక చోటికి బదిలీ చేశారు. నోట్‌ఫైల్ లేకుండా చేసే ప్రయత్నంలో ఇది చాలా కీలక పరిణామమని, అయితే ఆ అధికారిని విచారించకుండా తప్పించారంటూ చర్చ జరుగుతోంది. గతంలో కూడా రెండుమూడు విజిలెన్స్ కేసుల్లో ఆ అధికారి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని లంచాలు తీసుకున్నవారిపై చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నం చేశారని, అతని వద్దకు వచ్చిన ఫైల్ బయటకు రావాలంటే వేలకువేల రూపాయలు ముట్టజెప్పాల్సి వచ్చేదని, అటువంటి వారిపై విచారణ జరపకుండా ఒక ప్లాన్ ప్రకారమే ఆ స్థానం నుంచి బదిలీ చేశారంటూ అధికారులు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం చెప్పినా చేయకుండా కేవలం ఆ ఉన్నతవ్యక్తికి ఇష్టమైన నచ్చిన పని చేసిన వారికే అనుకూలమైన బదిలీలు చేయడమే కాకుండా ప్రస్తుతం తనకు సంబంధం లేని వాటిలో కూడా తలదూర్చి ఉన్నతాధికారిని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ విషయం ఉన్నతాధికారికి ఎలా తెలియచేయాలో తెలియడం లేదని ఉద్యోగులు చెప్పుకొంటున్నారు.