సందర్శకుల కోసం సరికొత్త ఏర్పాట్లు..
రూ. 4.50 కోట్లతో ఫంక్షన్ హాల్,
బోటింగ్ ప్రారంభానికి సన్నాహాలు
మేడ్చల్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ శిల్పారామం సరికొత్త శోభను సంతరించుకుంటున్నది. నగరానికి తూర్పున ఉన్న ఈ శిల్పారామంలో సందర్శకుల కోసం సంప్రదాయ వేదిక (ఫంక్షన్‌హాల్), బోటింగ్ ఏర్పాటుకు రూ. 4. 50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వేసవిలోనే బోటింగ్‌ను అందుబాటులోకి తీసుకురానుండగా, మరో రెండు నెలల్లో ఫంక్షన్‌హాల్‌ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 1500 మంది సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ఫంక్షన్హాల్లో శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. 190 మీటర్లు బోటింగ్‌లో విహరించేందుకు కొలను పనులు చివరిదశకు చేరుకున్నాయని శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య తెలిపారు. హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంతో సమానంగా తీర్చిదిద్దే ప్రణాళికతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించారు.
సందడే సందడి
ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శిల్పారామంలో గ్రామీణ వాతావరణం, కళాకృతులు, పిల్లలకు ఆట పరికరాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. పచ్చని తోటలు (ఉద్యానవనాలు) కనువిందు చేస్తాయి. శిల్పారామంలో తెలుగు పండుగలను సంప్రదాయబద్దంగా సందర్శకుల మధ్య నిర్వహిస్తారు. సాయంత్రం వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పెద్దలకు రూ. 20, పిల్లలకు రూ. 10 నామ మాత్రపు రుసుముగా నిర్ధారించారు. శిల్పారామాన్ని సెలవు రోజులు, వీకెండ్లలో 5 వేల నుంచి 8 వేల మంది, పనిదినాలలో 1500 నుంచి 2 వేల మంది సందర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు.