తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్‌లో గ్రేటర్ పరిధిలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ఇందులో మేడ్చల్, ఉప్పల్ స్థానాల్లో అగ్గి రాజుకున్నది. పెండింగులో పెట్టిన మిగిలిన పది స్థానాల్లో తొమ్మిది చోట్ల కూడా భారీ ఎత్తున అసమ్మతి పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉండటంతోనే జాబితా ప్రకటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో సీటుకు నోటు తెరపైకి వచ్చిన మహేశ్వరం కూడా పెండింగులోనే ఉండగా… ఇప్పటికే వెల్లడైన తొలి జాబితాలోనూ సీటుకు నోటు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): తొలి అడుగులోనే అగ్గి రాజుకున్న కాంగ్రెస్‌కు ముందుంది ముసుర్ల పండుగ అని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. తొలి జాబితాలో గ్రేటర్ పరిధిలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ఇందులో మేడ్చల్, ఉప్పల్ స్థానాలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పెండింగులో పెట్టిన మిగిలిన పది స్థానాల్లో తొమ్మిది చోట్ల అదే పరిస్థితి. నివురుగప్పిన నిప్పులా ఉండటంతోనే ఈ నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టినట్లుగా స్పష్టమవుతోంది. దీంతో పాటు సీటుకు నోటు తెరపైకి వచ్చిన మహేశ్వరం కూడా పెండింగులోనే ఉండగా.. ఇప్పటికే వెల్లడైన తొలి జాబితాలోనూ సీటుకు నోటు ఆరోపణలు వెల్లువెత్తిన స్థానాలు కొత్తగా బయటికి రావడం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్‌లో మేడ్చల్ సహా 24 నియోజకవర్గాలుండగా.. ఇందులో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌కి సరైన అభ్యర్థులే కరువయ్యారు. పార్టీ అధిష్ఠానం దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, ఇతరులు రేసులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఉన్న వారిలో ఏ ఒక్కరికీ టికెట్ దక్కినా మిగిలిన వారు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా సీటుకు నోటు వ్యవహారం తెరపైకి రావడంతో టికెట్ల కొనుగోలు పెద్ద ఎత్తున జరిగిందనే అనుమానాలు ప్రతి నియోజకవర్గంలోని నేతల్లో ఉంది. దీనికి తోడు రాత్రికి రాత్రి పార్టీలోకి వచ్చిన వారు, జూనియర్లు రేసులో ముందుండటంతో నిజంగా పార్టీ కోసం శ్రమించిన వారిలోని అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో ఉన్న ఉప్పల్, మేడ్చల్‌తో పాటు పాతబస్తీలోని నియోజకవర్గాల టికెట్ల కేటాయింపుల్లోనూ సీటుకు నోటు వ్యవహారం దాగి ఉన్నదని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డి ఈ విషయం బహిరంగ పరిచారు. గతంలోనే రేవంత్‌రెడ్డి తనను డబ్బులు అడిగారని, ఇవ్వనందుకే అది మనసులో పెట్టుకొని వేరొకరికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. అందునా.. ఇది చీకటి ఒప్పందంలో భాగమేనని కుండబద్దలు కొట్టారు. మేడ్చల్‌లోనూ ఇదే ఆరోపణ వినిపించింది.
అసమ్మతి నియోజకవర్గాలివే..
నగరంలో 14 మందికి.. కాంగ్రెస్ టికెట్లు ఖరారు
సిటీబ్యూరో, అక్టోబర్ 15 ( నమస్తే తెలంగాణ ) : మహానగరంలో కాంగ్రెస్ పార్టీ 14 మందికి టికెట్లు ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ఆదివారం 14 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ప్రకటించింది. అందులో మేడ్చల్- తోటకూర వజ్రేశ్ యాదవ్, మల్కాజిగిరి- మైనంపల్లి హనుమంత రావు, కుత్బుల్లాపూర్- కొలను హన్మంత్ రెడ్డి, ఉప్పల్- ఎం.పరమేశ్వర్ రెడ్డి, ముషీరాబాద్-అంజన్ కుమార్ యాదవ్, మలక్‌పేట- షేక్ అక్బర్, సనత్‌నగర్- డాక్టర్ కోట నీలిమ, నాంపల్లి- మహ్మద్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ – ఒస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ, గోషామహల్- మొగిలి సునీత, చాంద్రాయణగుట్ట- బోయ నగేశ్ (నరేశ్), యాకుత్‌పుర- కె.రవి రాజు, బహదూర్‌పుర- రాజేశ్ కుమార్ పులిపాటి, సికింద్రాబాద్- ఆదం సంతోష్ కుమార్ ఉన్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 55 మందితో అభ్యర్థుల జాబితాను హస్తం పార్టీ ప్రకటించింది.