సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తుపాకులు వెంట పెట్టుకొని, నకిలీ నంబర్ ప్లేట్ వాహనాలను వాడుతూ ఏపీ, ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా ముంబై, యూపీకి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న డ్రగ్ మాఫియాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, ఎస్ఓటీ డీసీపీ డి.శ్రీనివాసులు మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఠాకూర్ సచిన్ సింగ్, మహ్మద్ నదీమ్, మహ్మద్ సాక్లెయిన్, ప్రశాంత్ సింగ్, ముంబైకి చెందిన మహ్మద్ సలీం కలిసి గంజాయి అమ్మకాలు, రవాణా చేయడంలో ఆరితేరారు. యూపీలోని వినోద్‌కుమార్ యాదవ్‌తో కలిసి సచిన్ సింగ్ ముఠా గత ఐదేండ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి యూపీకి డ్రై గంజాయిని రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలో గత మూడు నెలల్లో మూడు దఫాలుగా 270 కిలోల గంజాయిని ఒడిశాలో రాజు అనే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలుచేసి, దానిని యూపీలో అమిత్‌సింగ్ అనే డ్రగ్ స్మగ్లర్‌కు విక్రయించారు.
గంజాయి రవాణా చేయడంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తమ వెంట తుపాకీ ఉండాలని భావించిన సచిన్.. యూపీలోని సునీల్‌సింగ్ అనే వ్యక్తి వద్ద నుంచి .32 కంట్రీమేడ్ పిస్టల్‌తో పాటు 11 రౌండ్లు కొనుగోలు చేశాడు. ఈ నెల 6న సచిన్ తన ముఠాలోని నదీమ్, సాక్లెయిన్, సలీమ్‌ను తమ వాహనానికి అరకు నుంచి హైదరాబాద్ వరకు ఎస్కార్ట్ చేయాలని కోరుతూ.. వారిని ముంబై నుంచి విజయవాడకు రప్పించాడు. దీంతో సచిన్, వినోద్, రవి, ప్రశాంత్ ముంబై నుంచి వచ్చిన వారితో విజయవాడలో కలుసుకున్నారు.
ఈ నెల 8న అరకులో రాజు అనే వ్యక్తి వద్ద నుంచి 254 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఇందులో 150 కిలోలు యూపీలోని అమిత్ సింగ్‌కు, మరో 100 కిలోలు ముంబైకి తరలించాలని ప్లాన్ చేశారు. ఇదిలాఉండగా.. ఈ ముఠా హైదరాబాద్ ఓఆర్ఆర్పై నుంచి యూపీ వెళ్తున్నదన్న సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు కలిసి అక్కడ నిఘా పెట్టారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఒక కారులోంచి ముంబైకి తరలించాల్సిన గంజాయిని మారుస్తూ ఈ ముఠా పోలీసులకు చిక్కింది.
సచిన్, నదీమ్, సాక్లెయిన్, సలీం, ప్రశాంత్‌ను అరెస్ట్ చేయగా.. మిగతా వారు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి కార్లను, కంట్రీమేడ్ పిస్టల్, 11 రౌండ్లు, 254 కిలోల గంజాయి, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1,04,65,700 ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ గంజాయి ముఠా పోలీసులపై కాల్పులు జరిపిందన్న వార్త నెట్లో చక్కర్లు కొట్టింది. దీనిపై సైబరాబాద్ పోలీసులు స్పందిస్తూ.. ఎలాంటి కాల్పులు జరుపలేదంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.