శంషాబాద్ రూరల్, డిసెంబర్ 30: ‘భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది’ అనే ప్రకటనతో అగర్బత్తి మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్న ప్రముఖ సంస్థ అంబికా నుంచి విడుదలైన కొత్త ప్రొడక్ట్ ‘రాగస్వర సుప్రభాతం’ను మంగళవారం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం (సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం)లో చినజీయర్‌స్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ, కార్యనిర్వాహక డైరెక్టర్ అంబికా రామచంద్రరావు, అంబికా ఆరోగ్య డైరెక్టర్ కార్తీక్ ఆలపాటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినజీయర్‌స్వామి మాట్లాడుతూ.. శ్రేష్టమైన దర్బార్ బత్తుల తయారీలో పేరొందిన సంస్థగా అంబికా ఎదిగిందని కొనియాడారు.
దేవుడికి సమర్పించే ధూపం ఘాటుగా ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉండకూడదని, ముక్కుకు పరిమళం, కంటికి ఇంపుగా ఉండాలని వివరించారు. అలాంటి పరిమళ ధూపం 125 ఏండ్లుగా అందిస్తూ, ఎప్పటికప్పుడు సరికొత్త దర్బార్ బత్తీ ప్రొడక్ట్ ‘రాగస్వర సుప్రభాతం’ను శ్రీరామానుజుల వారి సన్నిధిలో 108 దివ్యదేశాల సమక్షంలో ప్రారంభించుకోవడం గొప్పవరమని అన్నారు. పూజాగదిలో అగరువత్తుల పేటిక తెరిచిన వెంటనే స్వామివారి సుప్రభాత స్వరమ్ వినిపించడంతో కొత్త అనుభూతి పొందుతారని చెప్పారు. రాగస్వర సుప్రభాతం ప్రొడక్ట్ భక్తుల ఆదరణ పొంది అంబికా కృష్ణ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ మంగళా శాసనాలు అందజేశారు.
అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ఎన్నో విద్వేషాలతో అసమానతలు, అల్లర్లు జరుగుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో సమసమాజ స్థాపనకు త్రిదండి చినజీయర్‌స్వామి చేస్తున్న కృషి చాలా గొప్పదని కొనియాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 108 దివ్యదేశాల సమక్షంలో తమ కొత్త ప్రొడక్ట్ ‘రాగస్వర సుప్రభాతం’ ఆవిష్కరించుకోవడం తన పూర్వజన్మసుకృతంగా, అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ఉత్పత్తులు త్వరలో ప్రముఖ పూజాస్టోర్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.