సిటీబ్యూరో, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : భూములు ఇచ్చేది లేదని బాధితులంతా తెగేసి చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం భూసేకరణ విషయంలో అడుగులు వేస్తోంది. ముందుగా బాధితులతో చర్చలు జరిపి, వారి అభ్యంతరాలను స్వీకరించాల్సిన ప్రభుత్వం.. భూసేకరణతోనే అన్ని తేల్చుకోవాలి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు విషయంలో ఓ వైపు బాధితులంతా తమ సమస్యలు వినాలని చెబుతుంటే…
ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో రోడ్డు విస్తరణతో ఆస్తులు కోల్పోయి రోడ్డున్న పడుతున్న వందలాది మంది బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నా.. పరిహారం, ప్రాజెక్టు వెడల్పు విషయంలో ప్రభుత్వం ఏమాత్రం బాధితులతో చర్చించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ సర్కారు వందలాది మందిని రోడ్డున పడేలా వ్యవహారిస్తోంది. బహుళ ప్రయోజనాలు ఉండే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతోనే బాధితులు బయటకు వచ్చారు.
200 ఫీట్ల వెడల్పుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును శామీర్పేట వరకు దాదాపు 16 కిలోమీటర్లు జేబీఎస్ నుంచి నిర్మించాలని, ఇందుకు డిఫెన్స్ భూములతోపాటు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులను కూడా సేకరించడానికి ఏర్పాటు చేసింది. కానీ ప్రాజెక్టుకు ఇచ్చే భూముల పరిహారం తేల్చకుండా, వెడల్పు తగ్గించాలని బాధితుల ప్రతిపాదనలను పట్టించుకోకుండానే ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే వందలాది మంది భూ యజమానుల ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వం కూడా అస్పష్టమైన విధానాలతోపాటు, బాధితులకు స్పష్టత ఇవ్వకుండా భూములు సేకరించాలని అడుగులు వేసింది. ప్రభుత్వం వ్యవహారం మాత్రం ప్రాజెక్టు కోసం ఎలాగైన భూములు లాక్కునేలా ఉన్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
గ్రామసభల్లో నిరసన
గడిచిన 9 నెలల కాలంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వందలాది మంది బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భూసేకరణను అడ్డుకున్నారు. అయినా నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టుకు బాధితులు ఎందుకు సహకరించడం లేదనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ సర్కారు చేయలేదు. రాజీవ్ రహదారి జేఎసీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కారణంగా వందలాది మందికి జరిగే నష్టాన్ని తగ్గించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకునేలా లేదు. అక్కడితో ఆగిపోకుండా భూసేకరణలోనే తేల్చుకోవాలన్నట్లు వ్యవహారిస్తోంది. విధానపరమైన సమస్యలతో రోడ్డుకు ఇరువైపులా ఉండే భవనాలన్నీ కూలిపోతున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు.