కవాడిగూడ, ఏప్రిల్ 28:గుర్తు తెలియని దుండగులు 32 సంవత్సరాల యువకుడి తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హిమాయత్‌నగర్ స్ట్రీట్‌నెంబర్8 వద్ద విప్లాజా అపార్ట్మెంట్ వద్ద చోటుచేసుకుంది. యువకుడిని స్ట్రీట్ నంబర్ 8 లోకి తీసుకెళ్లి హతమార్చారు. మృతదేహాన్ని బట్టలో చుట్టి అపార్ట్మెంట్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కనే ఉన్న లిఫ్ట్‌లో పడేసి పారిపోయారు. సోమవారం ఉదయం స్వీపింగ్ చేయడానికి వచ్చిన సిబ్బంది అక్కడ రక్తపు మరకలు, బట్టలు పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
దోమలగూడ పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అపార్ట్మెంట్లో ఉన్న పంజాబ్నేషనల్ బ్యాంక్ పక్కన నున్న లిఫ్ట్‌లో మృతదేహం పడి ఉండటం గమనించారు. విషయం తెలుసుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, గాంధీనగర్ డివిజన్ ఇంన్చార్జి ఏసీపీ గురురాఘవేంద్ర, దోమలగూడ ఇనస్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐలు నిరంజన్, సాయిచంద్‌లు అక్కడికి చేరుకుని క్లూస్‌టీం, డాగ్స్కాడ్లను రప్పించి తనిఖీలు చేసి వివరాలు సేకరించారు.