సిటీ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మేందుకు వేలం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. భూముల అమ్మకంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి యూనివర్సిటీ విద్యార్థులు సిద్ధమయ్యారు.
హెచ్సీయూలోని అన్ని విద్యార్థి సంఘాలు, వర్కర్స్ యూనియన్, నాన్ టీచింగ్ స్టాఫ్ యూనియన్, టీచర్స్ అసోసియేషన్ కలిసి ఉమ్మడిగా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ భూములను రక్షించేందుకు ఉమ్మడిగా పోరాడతామని ప్రకటించారు. భూముల వేలం నిర్వహించి తీరుతామని మంత్రి శ్రీధర్ అంటున్నారని.. అదే జరిగితే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
యూనివర్సిటీ భూముల్లోకి ఎవరు అడుగు పెట్టినా తరిమికొడతామని హెచ్చరించారు. హెచ్సీయూ భూముల అమ్మడం విద్యార్థులకు అన్యాయం చేయడమే అవుతుందని ఆలిండియా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. బలవంతంగా అమ్మినా.. కొన్నవారిని ఆ భూమిలోకి అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్వరలోనే వేలాది విద్యార్థులతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు.