సిటీ బ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ క్వార్టర్స్‌ను లీజుకిచ్చిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం కొనసాగుతుండగానే వర్సిటీలో అలాంటి ఉదంతమే బయటకు రావడం కలకలం రేపుతున్నది. ప్రొఫెసర్లు నివాసముండే క్వార్టర్స్‌ను ఆది ధ్వని ట్రస్ట్ అనే సంస్థకు లీజుకిచ్చారని ప్రొఫెసర్లు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వెనుక వైపు ఉన్న క్యాంపస్‌లోని మూడు క్వార్టర్లను కిరాయికి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒక్కో క్వార్టర్‌కు నెలకు రూ. వెయ్యి మాత్రమే అద్దె చెల్లించే విధంగా ఏకంగా..30 ఏండ్లకు లీజుకిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తతంగమంతా గతంలో వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ రవీందర్ ఆధ్వర్యంలో 2023లోనే జరిగిందని అంటున్నారు. లీజుకు ఇవ్వడానికి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ సెల్ కూడా అంగీకరించినట్లు ప్రొఫెసర్లు, విద్యార్థులు చెబుతున్నారు.
యూనివర్సిటీ పరిధిలోని భూములను, భవనాలను లీజుకు, అద్దెకు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ వీసీకి ఎలాంటి హక్కులు ఉండవని వారు అంటున్నారు. అయినా ఏకంగా ఎకరం విస్తీర్ణంలో ఉన్న మూడు క్వార్టర్లను ఎలా లీజుకిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారులైన విద్యాశాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న ఎగ్జిక్యూటివ్ సెల్ ఎలా ఆమోదం తెలిపిందని విద్యార్థులు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఏ ప్రాతిపాదికన లీజుకు ఇచ్చారో చెప్పాలని వీసీకి లేఖ రాసింది. అదేవిధంగా లీజుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ప్రొఫెసర్లు ఆర్టీఐకి దరఖాస్తు సైతం చేసుకున్నారు.
క్వార్టర్ల లీజు నిబంధనల ఉల్లంఘనే…
యూనివర్సిటీలోని ప్రొఫెసర్ క్వార్టర్స్‌ను లీజుకివ్వడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ వీసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. యూనివర్సిటీలోని ఒక్క అంగుళం భూమిని కూడా ప్రైవేట్‌పరం చేయొద్దని డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి చెందిన భూములు, భవనాలను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు లీజుకివ్వడం జస్టిస్ చిన్నప్పరెడ్డి కమిటీ నివేదికను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. లీజుకు తీసుకున్న ఆది ధ్వని ట్రస్టు 30 సంవత్సరాల దీర్ఘకాలిక కింద అదనపు క్వార్టర్లను కోరుతుండటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు.
లీజును వెంటనే రద్దు చేయకుంటే న్యాయపరమైన పోరాటం చేస్తామని, అనుచితంగా అనధికారికంగా లీజుకిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లీజుకు తీసుకున్న ఆది ధ్వని ట్రస్ట్ వారు క్వార్టర్స్ రేనోవేషన్ పనులు చేస్తున్నారని, క్వార్టర్స్‌లో ఎలాంటి మరమ్మతులు చేయడానికి అనుమతులు ఉండవని చెప్పారు. ప్రొఫెసర్లు నివాసమున్నప్పుడే మరమ్మతులకు అనుమతించని వీసీ, ఈసీ…వారికెలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. లీజు రద్దు చేయకుంటే క్వార్టర్స్ పరిధిలోని ఎకరం భూమి అన్యాక్రాంతమయ్యే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.