అంబర్పేట, జూలై 10 : రాష్ట్రంలో నిధులలేమి పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల బాగు కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. బస్తీల్లో వీధి దీపాలు వేయడానికి జీహెచ్ఎంసీ వద్ద డబ్బు లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బుధవారం అంబర్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సరిగా అమలు జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రేషన్ కార్డులు ఇస్తామన్న కాంగ్రెస్ ఆరు నెలలవుతున్నా.. ఆ ఊసెత్తడం లేదని ఆరోపించారు. 15 ఏండ్లుగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం అందుకోలేకపోతున్నారన్నారు.
రేషన్ కార్డులు లేక చాలా మంది మహిళలు పొదుపు సంఘాల్లో చేరలేకపోతున్నారని, కొత్త గ్యాస్ కనెక్షన్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో నెలలు గడస్తున్నా గుంతల రోడ్లకు మరమ్మతులు చేసే పరిస్థితి లేకపోవడం శోచనీయమన్నారు. ఆడపిల్లల పెండ్లిండ్లకు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. ఆడ పిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సమస్యలపై ప్రశ్నించే వారే కరువయ్యారని, తాము నగర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.