అబిడ్స్, సెప్టెంబర్ 3ః నగరంలో వినాయక సామూహిక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు 29 వేల మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ తెలిపారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత 15 రోజులుగా పోలీస్ స్టేషన్ నుంచి కమిషనరేట్ వరకు పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి చిన్న చిన్న లోటు పాట్లను గుర్తించినట్లు తెలిపారు. జోన్ల వారీగా గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలలో భద్రత భావాన్ని పెంపొందించామని తెలిపారు. దీంతో ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలు పెరిగాయన్నారు. చాలా ప్రాంతాల్లో దర్శనమిస్తున్న చెత్త కుప్పలు, అధ్వాన్నంగా మారిన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని పలువురు మండప నిర్వాహకులు కోరగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని తెలిపారు.
గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి భారీ ఎత్తున విగ్రహాలను ఏర్పాటు చేశారని, సామూహిక వినాయక నిమజ్జనోత్సవం శోభ ఏ మాత్రం తగ్గకుండా ఏర్పాట్లను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 50 వేల వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు. తాను బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు తిరిగి ఏర్పాట్లను పరిశీలించినట్లు వివరించారు. వినాయక నిమజ్జనోత్సవానికి క్రేన్లను సిద్ధంగా ఉంచడంతో పాటు ఎప్పటిప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు, సిబ్బందికి సూచనలు చేసినట్లు తెలిపారు. సామూహిక నిమజ్జనోత్సవాలను పోటీగా కాకుండా ఆరోగ్యవంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.
వినాయక ప్రతిమలను తొందరగా నిమజ్జనోత్సవానికి తరలించాలని మండప నిర్వాహకులను కోరారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. 269 మొబైల్ క్రేన్లు, విగ్రహాల నిమజ్జనం కోసం 134 క్రేన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 13 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని, వినాయక విగ్రహాలకు అడ్డు రాకుండా ఏపుగా పెరిగిన చెట్టు కొమ్మల తొలగింపు పనులను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ జాయింట్ కమిషనర్ రమేష్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు బుచ్చిరెడ్డి, మెట్టు వైకుంఠం, ఆలె భాస్కర్, గోవిందరాఠి, కోశాధికారి శ్రీరాం వ్యాస్, ఉమా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు సకాలంలో జరగాలి
– రావినూతల శశిధర్
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సువర్ణాక్షరాలతో రాసుకునే విధంగా ఈ సంవత్సరం సామూహిక వినాయక నిమజ్జనోత్సవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా విచ్చేసి ప్రసంగించనున్నట్లు ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ పేర్కొన్నారు. నిమజ్జనం రోజు నగరమంతా కాషాయ మయమవుతుందని, ప్రజలు భారీగా వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు సిద్ధం
– అవినాష్ మహంతి
సామూహిక వినాయక నిమజ్జనోత్సవాన్ని శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. వినాయక మండపాలలోని వినాయక ప్రతిమలను తొందరగా నిమజ్జనోత్సవానికి తరలించాలని కోరారు. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా అవసరమైన మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు నిర్భయంగా వేడుకలను జరుపుకోవాలని తెలిపారు.
చెరువులతో పాటు తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టాం
-సీపీ సుధీర్‌బాబు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత సంవత్సరం 13,250 విగ్రహాల నిమజ్జనం జరగగా ఈ సంవత్సరం ఇప్పటికే 11,700 విగ్రహాలు నిమజ్జనమయ్యాయని రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. తమ కమిషనరేట్ పరిధిలో 59 చెరువులు ఉండగా తాత్కాలిక పౌండ్లను ఏర్పాటు చేసి వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు.