మేడ్చల్, మే 28 (నమస్తే తెలంగాణ): మత్స్య కార్మికుల సంక్షేమానికి గాను.. చెరువుల్లో చేప పిల్లల వదిలివేతకు ప్రభుత్వం ఇప్పటి వరకు టెండర్లను ఖరారు చేయలేదని మత్స్య సహకార సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం ప్రారంభం కాకముందు చెరువుల్లో చేప పిల్లల వదిలివేతకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే టెండర్ల ఖరారుపై ఇప్పటి వరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మత్స్యశాఖకు ఎలాంటి సమాచారం లేదు. దీంతో మత్స్య సహకార సంఘాల సభ్యులు ఆవేదన చెందుతున్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రతి ఏడాది జిల్లాలోని 233 చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై 63 లక్షల చేపపిల్లలను వదిలే విధంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ప్రతి సంవత్సరం మత్స్య కార్మికుల సంక్షేమానికి వంద శాతం సబ్సిడీపై 60 లక్షల పైచిలుకు చేపపిల్లలను వదలడమే కాకుండా , చేపలు పట్టే పరికరాలను కూడా సబ్సిడీపై అందించింది. చేపపిల్లల విక్రయాలకు ప్రత్యేక మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. జిల్లాలో 82 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా 3,738 మంది సభ్యులు ఉన్నారు. మత్స్యశాఖ ఆధీనంలోని చెరువులను నామ మాత్రపు కౌలుపై అందించి మత్స్యకార్మికుల సంక్షేమానికి కృషి చేసింది. అయితే ఇప్పటి వరకు చెరువుల్లో చేపపిల్లలను వదిలే టెండర్లు ఖరారు కాకపోవడంతో మత్స్యసహకార సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ యేడు చెరువుల్లో చేపపిల్లలను వదులుతారా? లేదా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.