Hyderabad | సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ వాయిదా కోరుతూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనతో పోలీసులు కంగుతింటున్నారు. ఎప్పుడు, ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చి రోడ్లపై బైఠాయిస్తారోననే ఆందోళన పోలీసుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే అశోక్‌నగర్ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి వీధి, గల్లీలో పహారా కాస్తున్నారు. పోలీసులు చేస్తున్న హడావుడితో స్థానికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాత్రి అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత మెరుపు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనతో పోలీసులు ఉలిక్కిపాటుకు గురయ్యారు.
ప్రభుత్వం డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా నగరంలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం మెట్టు దిగకపోవడమే కాకుండా నిరుద్యోగులకు బాసటగా నిలిచిన వారిపై వివిధ రకాలైన ఆరోపణలు చేస్తున్నది. ఉద్యమ ప్రభావాన్ని తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నది. ఈ కుట్రలను గుర్తించిన వేలాది మంది నిరుద్యోగ యువత శనివారం అర్ధరాత్రి రోడ్లపైకి ఒక్కసారిగా చొచ్చుకొని వచ్చి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. రోడ్లపై బైఠాయించిన నిరుద్యోగులు ఆదివారం ఉదయం వరకు ధర్నాలు నిర్వహించారు.
అశోక్‌నగర్, ఉస్మానియా, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో పోలీసులు నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లు, లైబ్రరీలు ఉన్న ప్రాంతాలను చుట్టుముట్టారు. యువకులు ఎవరూ రోడ్లపైకి రాకుండా ఉండేలా ఆదివారం సైతం కట్టడి చేశారు. చిక్కడపల్లిలోని సెంట్రల్ ల్రైబరీ వద్ద పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. మరోవైపు పరీక్షకు తేదీలు దగ్గరపడుతుండగా, వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం దిగిరాకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన మరింతగా పెరుగుతున్నది. తాము న్యాయపోరాటం చేస్తున్నామని, ఇంటెలిజెన్స్ రిపోర్టు,
న్యాయ నిపుణులు, పరీక్షలు నిర్వహించే నిపుణుల అభిప్రాయాలను తీసుకొని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళన గురించి.. ప్రభుత్వం తెలుసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులను అదుపు చేయడం కోసం పోలీసులు ఉస్మానియా వర్సిటీ, దిల్సుఖ్నగర్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో చేసిన అరాచకాలే తిరిగి తెలంగాణ పోలీసులు మొదలు పెట్టారంటూ నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. యువతను ఆందోళన చేయకుండా కట్టడి చేసేందుకు పోలీసులు రహదారులపై బందోబస్తును నిర్వహిస్తున్నారు. అయినా… పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఆదివారం కూడా నిరుద్యోగులు తమ నిరసన గళాన్ని వినిపించారు.