ఎల్బీనగర్, జూన్ 18: నిరుద్యోగుల నిరసన సెగకు ప్రభుత్వం బెంబెలెత్తుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటే దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ జేఏసీ నేతలను ముందస్తు అరెస్టు చేయడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వన మహోత్సవాన్ని ప్రారంభించేందుకు బీఎన్‌రెడ్డినగర్‌లోని గుర్రంగూడ ఫారెస్ట్ ప్రాంతానికి విచ్చేశారు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు నిరుద్యోగ జేఏసీ నాయకులను టార్గెట్ చేశారు. ఉదయం 6 గంటలకే నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, భుక్య కుమార్, ఆకాష్ గౌడ్‌ను సరూర్‌నగర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు. సీఎం పర్యటన ముగిశాక సాయంత్రం 6 గంటలకు వీరిని విడుదల చేశారు.
అదే విధంగా దిల్సుఖ్నగర్, చైతన్యపురి ప్రాంతాల్లోని నిరుద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థులను బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా రోడ్డుపైకి ఎవరినీ రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. సీఎం ఉప్పల్, నాగోల్ రింగ్‌రోడ్డు ద్వారా బీఎన్‌రెడ్డినగర్‌కు వెళ్తే దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న తమను అరెస్టు చేయడం ఏమీటని వారు ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.