శ్రీనగర్: భారత సైనిక స్థావరాల సమీపంలో చక్కర్లు కొడుతున్న పాకిస్థాన్ నిఘా డ్రోన్‌ను ఆర్మీ కూల్చివేసింది. చైనా తయారీ డ్రోన్‌గా ఆర్మీ అధికారులు గుర్తించారు. అందులో ఉన్న మైక్రోఎస్డీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. (Pak drone shot down) జమ్మూలోని ఖౌర్ సెక్టార్లో ఈ సంఘటన జరిగింది. చక్లా గ్రామానికి సమీపంలోని కీలక రక్షణ స్థావరాల వద్ద పాక్ నిఘా డ్రోన్ ఎగురుతుండటాన్ని ఆర్మీ సిబ్బంది గమనించారు. వెంటనే దానిని కూల్చివేశారు. డ్రోన్ శకలాలతోపాటు అందులో ఉన్న 64 జీబీ మైక్రో ఎస్డీ కార్డును స్వాధీనం చేసుకున్నారు.
కాగా, చైనా తయారు చేసిన ఈ డ్రోన్‌ను నిఘా, గూఢచర్యం కార్యకలాపాల కోసం పాకిస్థాన్ వినియోగిస్తున్నట్లు ఆర్మీ అధికారులు ఆరోపించారు. స్వాధీనం చేసుకున్న డ్రోన్, ఎస్టీకార్డు, ఇతర పరికరాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఆ డ్రోన్ మూలం, ప్రయాణ మార్గం, దాని లక్ష్యాలను నిర్ధారించడానికి సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.