సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం గందరగోళంగా మారింది. నిజానికి ఏ ప్రాజెక్టు అయినా మొదలుపెట్టాలంటే.. ముందుగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తర్వాత పనులు చేపట్టేందుకు టెండర్లను పిలుస్తారు. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో కేవలం హడావుడి చేసేందుకు భూసేకరణపై స్పష్టత రాక ముందే.. పనులు చేపట్టేందుకు టెండర్లను జీహెచ్ఎంసీ ఆహ్వానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు ప్యాకేజీల్లో కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ గేటు నుంచి జూబ్లీ చెక్ పోస్టు వరకు, బసవ తారకం హాస్పిటల్ మీదుగా అగ్రసేన్ విగ్రహం మీదుగా అండర్ పాస్, ఫ్లై ఓవర్లను రూ.1090 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు బల్దియా టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 27 నుంచి టెండర్ ప్రక్రియ మొదలు కానుండగా, మార్చి 26తో ప్రక్రియ ముగించేందుకు బల్దియా చర్యలు చేపట్టింది. అయితే అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టులో భూసేకరణపై ఎలాంటి స్పష్టత రాకుండా పనులు ఎలా మొదలుపెడతారనేది ఆసక్తిగా మారింది.
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు ఫ్లై ఓవర్లు, అండర్ పాసుల నిర్మాణంలో అత్యంత క్లిష్టమైనది భూ సేకరణ ప్రక్రియ. వాస్తవంగా ఏ ప్రాజెక్టు మొదలుపెట్టాలన్నా.. ముందు భూసేకరణ పూర్తి చేసిన తర్వాతనే.. పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానిస్తారు. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ లేకుండానే హడావుడిగా టెండర్లను పిలవడం ఎందుకనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పాత రోడ్ డెవలప్మెంట్ ప్లాన్(ఆర్డీపీ) పరిగణనలోకి తీసుకుని కొత్త ఆర్డీపీ ప్లాన్ సిద్ధం చేశారు. గత ఆర్డీపీలో దాదాపుగా 105 నివాసాలు ఉన్నట్లు తేలింది. అయితే ఈ నివాసాల నుంచి ఆస్తుల స్వాధీనం అధికారులకు తలకు మించిన భారమేనని చెప్పాలి. అంతేకాకుండా భూసేకరణపై ఇప్పటికే వివిధ న్యాయస్థానంలో మూడు కేసులు ఉండడం వీటిపై ఎలాంటి క్లారిటీ రాకుండానే టెండర్లను పిలవడం వెనుక అంతర్యమేమిటనేది తెలియాల్సి ఉంది.
బంజారాహిల్స్ రోడ్ నం. 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు భూసేకరణలో భాగంగా పలు భవనాలను మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ప్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ప్లాట్‌లో సగభాగం విస్తరణలో కోల్పోనుంది. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లో ఉన్న హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా మార్కింగ్ వేశారు. సుమారుగా తన ప్లాట్‌లో 500 గజాల వరకు కోల్పోనున్నారు. మాజీ మంత్రులు సమర సింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి వంటి ప్రముఖుల ఇండ్లకు కూడా మార్కింగ్ వేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 12 విరంచి ఆసుపత్రి నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు ప్రస్తుతం 80 అడుగుల రోడ్డు ఉంది. దీనిని 100 అడుగుల మేర విస్తరించనున్నారు. ఈ రోడ్డుకు రెండు వైపులా ఆస్తులు సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. 86 నివాసాలకు మార్కింగ్ చేశారు. కానీ ఏ ఒక్క ఆస్తిని కూడా అధికారులు స్వాధీనం చేసుకోలేదు. దీంతో భూసేకరణ కొలిక్కి రాకుండానే ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నట్లుగా చెప్పుకోవడానికే తాజా టెండర్లు పిలవడానికి గల కారణమని బల్దియాలో చర్చ నడుస్తోంది.