హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరాకు భూగర్భం నుంచి కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యత్నానికి మిస్టర్ 10 పర్సంట్ గండి కొడుతున్నట్టు తెలుస్తున్నది. కేబుల్ కొనుగోళ్లలో తనకు 10 పర్సెంట్ ఇస్తే తప్ప పనులు సాగనిచ్చేది లేదని ఆయన తెగేసి చెప్పినట్టు తెలిసింది. చింతల్‌కుంటలో ఆదివారం ఇద్దరు అమాయకులు 11 కేవీ వైర్లు తెగి మృత్యువాత పడ్డారు. ఓవర్‌హెడ్ వైర్లు ప్రజలకు ప్రాణాంతకమే కాకుండా పలుసార్లు విద్యుత్తు అంతరాయాలకు కారణమవుతున్నాయి.
ప్రమాదాల నివారణకు, అంతరాయాలను తొలగించడానికి ఓఆర్ఆర్లోపల ఓవర్‌హెడ్ కేబుల్స్ స్థానంలో యూజీ కేబుల్స్ వేయడానికి డిస్కం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే కేబుల్ విషయంలో పర్సంటేజీ గొడవతో పనులు ముందుకు సాగడం లేదని డిస్కం అధికారులు వాపోతున్నారు. నమస్తే తెలంగాణలో మిస్టర్ టెన్‌పర్సెంట్ కథనం వచ్చిన అనంతరం అధికారుల్లో అలజడి మొదలైంది. నగరంలో డిస్కం పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించిన ఉన్నతాధికారులు ముందుగా జూబ్లీ బస్‌స్టేషన్ పనులను ముగించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ నగరంలో 84,560 కిలోమీటర్ల పొడవున 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ విద్యుత్తు తీగలుంటే.. అందులో అండర్‌గ్రౌండ్ కేబుల్స్ కేవలం 2237 కి.మీ. మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓవర్‌హెడ్ లైన్లను తొలగించి అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. సమ్మర్‌యాక్షన్ ప్లాన్ విషయంలో తాము అనుమతించిన పనులకు అవసరమైన కేబుల్ స్టోర్స్‌లో లేకపోవడంతో ఆ వైర్లను కాంట్రాక్టర్లే కొనుగోలు చేయాలని డిస్కం లేఖలు రాసింది. జూబ్లీబస్‌స్టేషన్ విషయంలో ఓవర్‌హెడ్ పద్ధతిలో కేబుల్స్ వేయాలని, సికింద్రాబాద్‌లో టెండర్లను రివైజ్ చేయాలని నిర్ణయించింది.
జూబ్లీ బస్టాండ్ వద్ద మొత్తం రెండున్నర కిలోమీటర్ల కేబుల్‌లో కేవలం ఎనిమిదివందల మీటర్లు వేయాల్సిన చోట అందుకు అవసరమైన కేబుల్ కొనుగోలు చేయలేక ఓవర్‌హెడ్ పనులవైపే సంస్థ మొగ్గు చూపింది. నమస్తే తెలంగాణలో మిస్టర్ టెన్‌పర్సెంట్ కథనాలతో కదలిన డిస్కం అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. పాత పద్ధతికే మొగ్గుచూపుతూ ఓవర్‌హెడ్ లైన్లు వేసుకోవాలని ఎస్పీడీసీఎల్ తమ కాంట్రాక్టర్‌కు సూచించింది. ఇందుకోసం అంచనాలను సవరించుకొని పనులు మొదలుపెట్టాలని చెప్పడంతో పనులు మొదలయ్యాయి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనుల టెండర్లను రద్దు చేసినట్టు అంతర్గతంగా ప్రకటించిన డిస్కం కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎండీలను తిరిగి వెనక్కు ఇచ్చేసినట్టు తెలిసింది. ఈ టెండర్లను మళ్లీ రివైజ్ చేసి కేబుల్ సరఫరాతో సహా టెండర్లను పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ విషయంలోనూ డిస్కం నిర్ణయంపై కాంట్రాక్టర్లు, అధికారుల్లో చర్చ జరుగుతున్నది. లోపల ఓవర్‌హెడ్ లైన్లు వేయడానికి టవర్లకు అనుమతించరని, ఒకవేళ అక్కడ పనులు చేయాలంటే ఖచ్చితంగా కేబుల్ కావలసిందేనని విద్యుత్తు శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఇప్పటివరకు ఏదో ఒకరకంగా దాటవేత ధోరణే ప్రదర్శించినా దుండిగల్ వ్యవహారంలో కూడా టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్లీ కేబుల్‌తో సహా పిలుస్తారా.. లేక తామే కేబుల్ సైప్లె చేసేందుకు మిస్టర్ టెన్పర్సెంట్ను ఒప్పిస్తారా.. ఈ విషయంలో పై స్థాయి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.సమ్మర్‌యాక్షన్ ప్లాన్లకు సంబంధించిన పనుల కోసం 33 కేవీ కేబుల్‌కు కిలోమీటర్‌కు రూ.30,19,133.84 చొప్పున చెల్లిస్తామని డిస్కం కాంట్రాక్టర్లకు లేఖ పంపింది. ఇందుకు తమ అనుమతి తెలియచేయాలని కోరింది. ఒక్కో మీటర్‌కు డిస్కం రూ. 3019 చెల్లిస్తే తమకు గిట్టుబాటు కాదని వారు కాంట్రాక్టర్లు అంటున్నట్టు తెలిసింది.
హెచ్‌టీ కనెక్షన్లకు వినియోగదారుల వద్ద డిస్కం రూ.3800 వసూలు చేస్తూ.. తమకు అంతకంటే తక్కువ చెల్లించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై రెండుమూడురోజుల్లో ఒక నిర్ణయం తీసుకుని సామూహికంగా తాము పనులు చేయలేమని చెప్పి, ఈఎండీలు వెనక్కు తీసుకోవాలని కొందరు కాంట్రాక్టర్లు నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఒక సీనియర్ అధికారి కూడా కాంట్రాక్టర్లతో మీ పనులు ఇప్పట్లో అయ్యేవి కావు.. కేబుల్ కొనేది లేదు.. మీరు కొన్నా వర్కవుట్ కాదు.. ఈ పనులు వదిలేసి వేరే పనులు చూసుకోమని సలహా ఇచ్చినట్టు తెలిసింది.