కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఆటో డైవర్లను వేధిస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అత్యధిక వడ్డీతో రుణాలు ఇచ్చి.. సకాలంలో చెల్లించడం లేదని ఆటోలను తిరిగి ఆ సంస్థలే ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. అలా నగరంలో 1.40లక్షల ఆటోలు ఉంటే 70వేల ఆటోలు వారి అదుపులోనే ఉండటం గమనార్హం. వాటిని ఇతరులకు కిరాయికి ఇస్తూ ఫైనాన్సర్లు డబ్బులు దండుకుంటున్నాయి. సొంత ఆటో ఉన్నప్పటికీ అది కిస్తీలు కట్టక జప్తు అయితే కిరాయి ఆటో నడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిపై ఆటో డ్రైవర్లు తమకు జరుగుతున్న నష్టాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమను వడ్డీల ముసుగులో వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 18 ( నమస్తే తెలంగాణ)
పట్టించుకునేవారేరీ?
గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 700కు పైగా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థలు అందరు సిండికేట్‌గా మారి.. కొంతమంది అధికారులకు చెయ్యి తడుపుతూ తమ వేధింపులకు లైసెన్స్ తీసుకుంటున్నారు. నగరంలో ఆటోలపై ఆధారపడి రెండు నుంచి మూడు లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుతం ఇటు కిరాయి డబ్బులు రాక ఆటు గిరాకీ లేక చాలా మంది ఆటో డ్రైవర్లు రోడ్డునపడుతున్నారు. కొందరు అప్పుల పాలై కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు.
ప్రభుత్వం రుణాలు మంజూరు చేయకపోవడం వల్ల కార్మికులు ప్రైవేట్ ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన సంస్థలు అధిక వడ్డీలకు ఆటోలను విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక్క ఆటో ఖరీదు రూ.2.40 లక్షలు ఉండగా ముందుగానే రూ.50-60వేలు కట్టించుకుని మిగిలిన మొత్తానికి రూ.2.50 నుంచి 3 రూపాయలపైనే వడ్డీని కలిపి సుమారు 5 లక్షల వరకు మొత్తాన్ని కిస్తీల రూపంలో వసూలు చేస్తున్నారు. ఏదైన ఇబ్బంది వచ్చి కిస్తీలు చెల్లించని పక్షంలో ఆటోను జప్తు చేసుకుని, వారి వ్యక్తులకు కిరాయికి ఇచ్చి డబ్బులు దండుకుంటున్నారు.
ఆత్మహత్యలు తప్ప వేరే దిక్కు లేదు
ఫైనాన్స్ సంస్థలపై ప్రభుత్వ ఆధీనం లేకపోవడం దుర్మార్గం. ఒక్క కిస్తీ ఆలస్యమైనా రోడ్డుపైనే బండి ఆపి లాక్కుంటున్నారు. వారిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ఆటోను బలవంతంగా ఇతరులకు అమ్మేల ఒత్తిడి తెస్తున్నారు. చాలా మంది సొంత ఆటోలను ఫైనాన్సర్ల ఆగడాలతో కోల్పోయారు. చాలా మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ఫైనాన్సర్ల దాష్టికంపై చర్యలు తీసుకోవాలి.
-శాతం రమేశ, బీఆర్టీయూ ఆటో యూనియన్ నాయకుడు