జియాగూడ, జూన్ 15 : భార్యతో నిత్యం గొడవలు జరుగుతూ ఉండడంతో ఓ రౌడీషీటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధి లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది. ఎస్.ఐ.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధి లోని కేశవస్వామి నగర్ లో ఉంటున్న హత్వాల్ ఉమేశ్ (35)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఉమేశ్ తరచూ గొడవలకు దిగుతున్న కారణంగా 2011 లో కూల్సుంపురా పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ గా నమోదయ్యాడు. అప్పటి నుండి గొడవలు, గంజాయి విక్రయాలు, హత్యలకు పాల్పడటంతో తరచూ జైలుకు వెళ్లి వస్తుండేవాడు. ఇతని పైన దాదాపు 17 కేసులు నమోదై ఉన్నాయి. కాగా గత కొంత కాలంగా ఇంట్లో భార్యతో గొడవలు జరుగుతున్నాయి.
ఆదివారం కూడా ఏదో విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత భార్య వంటింట్లో వంట చేస్తుండగా ఆ సమయంలో ఉమేశ్ బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన భార్య..స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టింది. కాగా అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఉమేశ్ కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఉస్మానియా దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఉమేశ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.