అంబర్ పేట, జూలై 7 : భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాంనగర్ లోని బహదూర్‌పురాలో నివాసముండే మంగమ్మ, బాబురావుల కుమారుడు సంతోష్ (36)కు రామంతాపూర్‌కు చెందిన శారదతో మే తొమ్మిదో తేదీన వివాహం జరిగింది. సంతోష్ హబ్సిగూడలోని ఐఐసీటీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తూ రాత్రిపూట బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయిన తర్వాత అనారోగ్య సమస్యలతో శారద, సంతోష్‌తో సహకరించడం లేదు. తనను మోసం చేసి పెళ్లి చేశారని భావించిన సంతోష్ పెళ్లి రద్దు కోసం లీగల్ నోటీసులు పంపించారు. దీంతో భార్య తరపు బంధువులు శారద అనారోగ్య సమస్యలతో పాటు బాగోగులు నువ్వే చూడాలని సంతోష్ పై ఒత్తిడి పెంచారు.
అందుకు సంతోష్ నిరాకరించాడు. బంధువులు అయిన మేనమామలు, అత్తలు, సంతోష్‌ను బెదిరించి అవమానించారు. మీ కుటుంబ సభ్యులు అందరిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని సంతోష్ ను బెదిరించడంతో మానసిక వేదనకు గురై ఆదివారం హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి మంగమ్మ, సోదరి భారతి, బావ మహేశ్ తెలిపారు. సంతోష్ మృతికి భార్య శారదతో పాటు అత్త, మామ, మేనమామలు ఇందిరా, వెంకటేశ్, సాయినాథ్, యాదగిరి, మహేశ్వరి, వరలక్ష్మి కారణమని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.