హయత్‌నగర్, మే 6 : ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ప్రేమిస్తున్నానని వీడియో కాల్స్, మెసేజ్‌లు పంపుతూ ఓ యువకుడు వేధింపులకు గురిచేయగా.. మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం… హయత్‌నగర్ డివిజన్, రంగనాయకులగుట్ట కాలనీలో నివాసముంటున్న కనిగిరి విజయ్, తిరుపతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె మీనాక్షి(14) హయత్‌నగర్, జెడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతోంది. ఆరు నెలల క్రితం ఇంటి ముందున్న పార్కులో కుక్క ను తీసుకెళ్లి మీనాక్షి వాకింగ్ చేస్తుండగా అదే కాలనీలో నివాసముంటున్న పానుబోతు రోహిత్ ప్రేమ పేరుతో వేధించాడు. వెంటనే బాలిక తండ్రి విజయ్‌కు చెప్పిం ది. అతను.. రోహిత్ తండ్రి స్వామి ఇంటికెళ్లి మందలించగా.. ఇకపై మీ కూతురు జోలికి వెళ్లకుండా చూస్తానని హామీనిచ్చాడు.
అనంతరం కొద్ది రోజులకు రోహిత్.. సోదరుడు నూతన్ ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ ద్వారా మీనాక్షి ఇన్‌స్ట్రాగ్రామ్‌కు తరచుగా వీడియో కాల్స్, ఎస్ఎంఎస్లు పంపుతున్నాడు. ఈనెల 4న మధ్యాహ్నం 3.28 గంటలకు మీనాక్షికి ఐలవ్యూ…అని మెసేజ్ పంపించాడు. అదే రోజున బాలిక తండ్రి విజయ్ హయత్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బావమరిది భార్య చనిపోవడంతో మహబూబ్‌నగర్, మానాజీపేటకు విజయ్, భార్య తిరుపతమ్మతో కలిసి వెళ్లాడు. సోమవారం మీనాక్షి వద్దకు వచ్చిన రోహిత్ తనను ప్రేమించాలని., లేకపోతే నీ సంగతి చూస్తా.. అంటూ బెదిరించి వెళ్లాడు. అదేరోజు రాత్రి 11గంటలకు ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు మీనాక్షి విషయం చెప్పింది.
రాత్రి ఎక్కువ సమయం కావడంతో ఉదయం మాట్లాడుదాం.. అనిచెప్పి పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తిరుపతమ్మ మున్సిపల్ వాటర్ పట్టుకునేందుకు నిద్రలేవగా ఇంట్లోని రేకుల కింద మీనాక్షి చున్నీతో ఉరేసుకుని వేలాడుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. తన కూతురు చావుకు కారణమైన రోహిత్, స్వామి, నూతన్లపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజునే నిందితుడిపై పోలీసులు చర్యలు తీసుకుంటే తన కూతురు బతికి ఉండేదని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కూతురు చావుకు పోలీసుల నిర్లక్ష్యం కూడా కారణమైందని వారు ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తన కూతురు చావుకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు.