బొల్లారం, జనవరి 2: ప్రకృతి ఔత్సాహికులకు, ఉద్యాన వన ప్రేమికులను మంత్రముగ్ధులను చేసే దృశ్యాలను అందించి పుష్పాలు, పుష్పేతర ప్రదర్శనల విస్తృత శ్రేణిని ప్రదర్శించడానికి ‘ఉద్యాన్ – ఉత్సవ్’ ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తుందని రాష్ట్రపతి భవన్ అధికారి సమరేశ్ అన్నారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ – ఉత్సవ్ ప్రదర్శనలను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ సామ్యూల్ ప్రవీణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ డా. శరవణన్, షైక్ మీరా, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, తెలంగాణ ఏడీఏ హుస్సేన్ బాబు, ఫార్మర్ వెల్ఫేర్ అడిషనల్ కమిషనర్ సంజయ్ కుమార్, రాష్ట్రపతి భవన్ డైరెక్టర్ శివేంద్ర చతుర్వేది హాజరయ్యారు.
ఈ సందర్భంగా రైతు సాధికారత సమితి, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నిర్వాహిత సహజ వ్యవసాయ శాస్త్రవేత్తలు సహజ వ్యవసాయం హార్టికల్చర్ పద్ధతులు, ఆలుగడ్డ, అల్లం పంటలపై నిర్వహణ పద్ధతులు పంటల సంస్కరణలో మంచి హార్టికల్చర్ పద్ధతులు, కూరగాయల పంటల సాగుతో పాటు వివిధ సాంకేతికత అంశాల పైనా రైతులకు అవగాహన కల్పించారు. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో వివిధ రాష్ర్టాల సంస్కృతి సంప్రదాయాల నృత్యాలు, ఆదివాసీ నృత్యాలను, మహాభారతంలోని శ్రీకృష్ణ రాయబార ఘటాన్ని ప్రదర్శించి సందర్శకులను అలరించారు.
ఉద్యాన్ – ఉత్సవ్‌లో భాగంగా వివిధ వర్సిటీల, ఎన్జీఓ, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ నుంచి సుమారు 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు. గురువారం ఒక్కరోజే సుమారు 6000 మంది సందర్శకులు, పాఠశాల, ఎన్సీసీ క్యాడెట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు జనవరి 2 నుంచి 13 వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందని, ప్రవేశం ఉచితమని నిలయం అధికారిణి రజినీ ప్రియ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రపతి పబ్లిక్ రిలేషన్స్ అధికారి సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.