Hyderabad | ఎల్బీనగర్, ఏప్రిల్ 19: స్వీట్లో ఎండు రొయ్యను పెట్టి ఓ మిఠాయి షాపు యజమాని నుంచి డబ్బులు గుంజేందుకు యత్నించి ఓ ఇద్దరు యూట్యూబర్లు అడ్డంగా బుక్కయ్యారు. షాపు ఓనర్ వాళ్ల మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫోన్ చేయడంతో బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి పరారయ్యారు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయారు. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే సరూర్ నగర్ వేంకటేశ్వర కాలనీ రోడ్డు నంబర్ 15లో ఉన్న శ్రీ బాలాజీ మిఠాయి బండార్ షాపు వద్దకు శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు కస్టమర్లు వచ్చారు. షాపులో స్వీట్ కొనుక్కొని తినే సమయంలో తమ వద్ద తెచ్చుకున్న ఒక ఎండు రొయ్యను అందులో పెట్టి వాంతులు చేసుకుంటున్నట్లుగా నటించారు. అనంతరం మిఠాయిల తయారీలో శుభ్రత పాటించడం లేదంటూ షాపు యజమానితో గొడవకు దిగారు. తాము ప్రెస్ రిపోర్టర్లం అని చెబుతూ.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు డబ్బులు ఇవ్వకపోతే మిఠాయి షాపులో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని సోషల్‌మీడియాలో పోస్టు చేసి పరువు తీస్తామని బెదిరింపులకు దిగారు. కానీ వాళ్ల బెదిరింపులకు భయపడని షాపు యజమాని పోలీసులకు ఫోన్ చేశారు.
స్వీట్ యజమాని పోలీసులకు ఫోన్ చేయడం చూసిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో షాపు యజమాని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను చిర్రా కోటేశ్, వడ్లకొండ నరేశ్‌గా గుర్తించారు. వాళ్ల దగ్గర ఆర్ఈ5 అనే యూట్యూబ్ ఛానల్ ఐడీ కార్డులను గుర్తించారు. వాళ్లే కావాలనే స్వీట్లో ఎండు రొయ్యను పెట్టి తమ ఆరోగ్యం పాడైందని, డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసినట్లు నిర్ధారించారు.ఇలాగే వేరే స్వీట్ షాపు, హోటల్స్‌లో చేశారేమోనన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.