బంజారా హిల్స్, ఏప్రిల్ 5: ప్రేమ జంట ఇల్లు వదిలి వెళ్లేందుకు సహాయం చేశారంటూ పోలీసులమని నమ్మించి ఇద్దరు యువకులను కిడ్నాప్ చేయడంతో పాటు దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా నగర్లో నివాసం ఉంటున్న భూమిరెడ్డి కిషోర్ రెడ్డి అనే వ్యక్తి టీవీ నటులు ఇంద్రనీల్ వద్ద పీఏగా పని చేస్తుంటాడు. కిషోర్ రెడ్డితోపాటు సందీప్, పల్లె శివ అనే యువకులు అతని గదిలో ఉంటారు. పల్లె శివ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సమీపంలోని ఉప్పునుంతల గ్రామానికి చెందినవాడు. గత కొన్ని నెలలుగా తన ఊరికి చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇటీవల ఇంట్లోంచి వెళ్ళిపోయారు.
ఈ నేపథ్యంలో శివ ఆచూకీ కోసం నగరానికి వచ్చిన యువతి కుటుంబ సభ్యులు సోహైల్, ఇబ్బూ తో పాటు కొంతమంది వ్యక్తులు రెండ్రోజుల క్రితం కృష్ణనగర్ వచ్చారు. పోలీస్ స్టిక్కర్ ఉన్న థార్ కారులో ఉన్న అగంతకులు తాము జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చామని, అచ్చంపేటలో యువతీ కిడ్నాప్ కేసులో విచారణ కోసం రావాలంటూ బలవంతంగా శివ రూమ్ మేట్స్ అయిన కిశోర్ రెడ్డి, సందీప్ లను వాహనంలో ఎక్కించుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లకుండా తుక్కుగూడ వైపు తీసుకెళ్లి కారులో నిర్మానుశ్య ప్రాంతాల్లో ఇద్దరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న టీవీ నటుడు ఇంద్రనీల్ జూబ్లీహిల్స్
పోలీస్ స్టేషన్లో వాకబు చేశాడు.
తాము ఎవరిని తీసుకురాలేదని, వచ్చినవారు ఎవరో తెలియదని ఇక్కడ పోలీసులు చెప్పారు. దీంతో కిషోర్ రెడ్డి ఫోన్ కి కాల్ చేసిన ఇంద్రనీల్ వెంటనే కిడ్నాప్ చేసిన ఇద్దరిని వెనక్కి తీసుకురావాలంటూ ఆగంతకులకు చెప్పారు. దీంతో వారిని అచ్చంపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించిన సోహైల్, ఇబ్బూ తదితరులు వెళ్ళిపోయారు. అచ్చంపేట వెళ్లిన ఇంద్రనీల్ వారిద్దరినీ విడిపించుకుని వచ్చారు. పోలీసులమంటూ చెప్పి తమను కిడ్నాప్ చేయడంతో పాటు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కిషోర్ రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.