జీడిమెట్ల, అక్టోబర్ 16: మూత పడిన ఓ పరిశ్రమలో పునరుద్ధరణ పనులు చేస్తున్న ఇద్దరు (కవలలు) కార్మికులు కెమికల్ సంపులో పడి మృతి చెందారు. మరో కార్మికుడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. జీడిమెట్ల డీఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాము (32), లక్ష్మణ్ (32) కవల పిల్లలు. వీరు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి గుండ్ల పోచంపల్లి అన్నారం గ్రామంలో ఉంటున్నారు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా సాధు నారాయణ ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ వద్ద రోజువారీ కూలీలుగా పనిచేశారు.
గత నాలుగు రోజులుగా వీరిద్దరూ జీడిమెట్ల ఎస్వీ కో ఆపరెటివ్ సొసైటీలో మూడేండ్లుగా మూతపడి ఉన్న సాబూరి ఫార్మా పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తున్నారు. బుధవారం రాము, లక్ష్మణ్‌తో పాటు సురేందర్ రెడ్డి (40) పరిశ్రమలో ఉన్న వ్యాక్యూం ట్యాంకు గోడపై నిలబడి ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తున్నారు. టీ తాగడానికి గోడ దిగే క్రమంలో.. రాము ప్రమాదవశాత్తు వ్యాక్యూం ట్యాంకులో పడిపోయాడు.
రామును రక్షించేందుకు లక్ష్మణ్ ట్యాంకులోకి దిగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇద్దరు బయటకు రాకపోవడంతో.. సురేందర్ రెడ్డి ట్యాంకులోకి దిగి రాము, లక్ష్మణ్‌ను బయటకు తీశాడు. అనంతరం పరిశ్రమలో ఉన్న కొంత మంది సహాయంతో షాపూర్‌నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్టు డాక్టర్ నిర్ధారించారు. సురేందర్ రెడ్డి కూడా అస్వస్థతకు గురి కావడంతో అదే దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. మృతుల సోదరుడు సురేశ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.