Students Missing |మూసాపేట: ఇద్దరు విద్యార్థినులు బడికి పోకుండా చీరాలలోని సూర్యలంక బీచ్‌కు వెళ్లి.. రెండ్రోజుల పాటు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. తీరా ఆచూకీ దొరికాక ఇటు తల్లిదండ్రులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకోవడంతో కథ సుఖాంతమైంది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ ముత్తు తెలిపిన వివరాల ప్రకారం….బాలజీనగర్, ఆల్వీన్‌కాలనీలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు(13) వివేకానందనగర్ చైతన్య టెక్నో పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు.
రోజూలాగే బాలికల తల్లిదండ్రులు బుధవారం ఉదయం స్కూల్లో వదిలి వెళ్లారు. ఇంటికి తీసుకెళ్దామని సాయంత్రం పాఠశాలకు చేరుకోగా, తమ కూతుళ్లు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఎంత వెతికినా లాభం లేకపోవడంతో సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ ఇద్దరు బాలికలను వెతికే క్రమంలో పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా.. చిత్తారమ్మ ఆలయ సమీపంలో నిర్మాణంలో ఓ భవనంలో విద్యార్థినులు తమ స్కూల్ యూనిఫాంను వదిలి తమతో తెచ్చుకున్న సివిల్ డ్రెస్ మార్చుకొని బయటికి వచ్చినట్టు వెల్లడైంది. పోలీసులు స్నేహితులను విచారించగా.. బాలికలిద్దరూ తరచుగా ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో ఉన్న సూర్యలంక బీచ్‌కు వెళ్లాలని మాట్లాడేవారని తేలింది. పోలీసులు వెంటనే చీరాల పోలీసులను సంప్రదించి, విద్యార్థినుల ఆచూకీ కనుక్కొన్నారు. బాలికలు క్షేమంగా ఉన్నారని తెలుసుకొని కూకట్పల్లి పోలీసులు వారిని తీసుకురావడానికి బయలుదేరారు.