HCU | కొండాపూర్, డిసెంబర్ 24 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కాపీ చేస్తూ ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ విభాగంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 21వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు గచ్చిబౌలిలోని వర్సిటీ క్యాంపస్‌లో రాత పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షకు హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్(30) హజరయ్యాడు. కాగా వరీక్ష రాస్తున్న సమయంలో అనిల్ చెవిలో ఉన్న బ్లూటూత్ నుంచి పదేపదే బీప్ సౌండ్ రావడంతో ఇన్విజిలేటర్ తనిఖీ చేశాడు. అప్పుడే షర్ట్‌కు ఉన్న స్కానర్ కనిపించింది. ఆ స్కానర్‌తో క్వశ్చన్ పేపర్ స్కాన్ చేసి, బాత్రూంమ్కు వెళ్లి అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సమాధానాలు తెలుసుకుని.. చెవిలో ఉన్న బ్లూటూత్‌తో వింటూ సమాధానాలు రాస్తున్నట్లుగా గుర్తించారు.
హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న అనిల్‌ను అదుపులోకి తీసుకున్న వర్సిటీ అధికారులు మిగతా విద్యార్థులను కూడా క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే హర్యానాకు చెందిన మరో యువకుడు సతీశ్ సైతం కూడా ఇలాగే కాపీ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఇద్దరు యువకులను వర్సిటీ అధికారులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.