హిమాయత్‌నగర్,జూన్11: మామిడి పండ్లు తిని అస్వస్థతకు గురై ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ అక్కా చెల్లెళ్లు మృతి చెందిన ఘటనపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పదించారు. క్షేత్రస్థాయిలో సమగ్రమైన విచారణ చేయాలని గురువారం నారాయణగూడ పోలీసులను ఆదేశించారు. కర్ణాటక బీదర్ వాసులు వైజినాథ్,ఇందుమతి దంపతులు నారాయణగూడ లోని విఠల్‌వాడిలో నివాసం ఉంటున్నారు.ఈ నెల 6 న రేణుక అనే బంధువు వీరి ఇంటికి వస్తున్న క్రమంలో నారాయణగూడలోని తోపుడు బండి వద్ద 2 కేజీల మామిడి పండ్లను కొనుగోలు చేసుకుని తీసుకువచ్చింది.
ఈ మామిడిపండ్లను రేణుక,ఆమె తల్లి, కుమారుడితో పాటు ఇందుమతి, ఆమె ఐదుగురు కుమార్తెలు మొత్తం 9మంది తిన్నారు. ఈ నెల 7వ తేదీన ఇందుమతితో పాటు ఆమె ఐదుగురు కుమార్తెలకు విపరీతమైన వాంతులైయ్యాయి.దీంతో ఆందోళన చెందిన వారు కాచిగూడలోని ఓ ప్రైవేట్ దవాఖాన కు చికిత్స నిమిత్తం వెళ్లగా అక్కడ అదే రోజు రాత్రికి 17 ఏండ్ల భువనేశ్వరి అనే బాలిక మృతి చెందగా మరుసటి రోజు మరో బాలిక సంధ్యరాణి(10) సైతం మృతి చెందింది.
ఈ వరుస మరణాలతో వారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.ఈ ఘటనలో ఇద్దరు బాలికలు మృతి చెందగా ఇందుమతితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు చికిత్స అనంతరం డిశ్చార్జ్ కాగా మరో కుమార్తె దవాఖానలో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పుడ్,ప్రూట్ నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం.మామిడి పండ్లు తిన్న తరువాతనే తాము అస్వస్థతకు గురైనట్లు బాధిత కుటుంబం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మామిడి పండ్లు తొందరగా మగ్గేందుకు వినియోగించే రసాయనాలు కారణమా ,ఇతర ఆహార పదార్థాల వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.