Old City | చార్మినార్, ఫిబ్రవరి 15 : ఇద్దరు కరుడుగట్టిన రౌడీ షీటర్లను సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. చాంద్రాయణ గుట్ట, బార్కస్ ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు హబీబ్ తలా బిన్ అబ్దుల్ ఖదీర్ ఇద్రిస్(27) అలియాస్ హబీబ్ చాంద్రయణగుట్ట, మాదన్నపేట్ పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్నాడు. ఈ రౌడీషీటర్‌పై ఏడు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ తెలిపారు. కోర్టుల్లో కొనసాగుతున్న విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని అడషనల్ డీసీపీ తెలిపారు.
చంచల్ గూడా ప్రాంతానికి చెందిన ఆనంద్ అగర్వాల్ (27)అలియాస్ మహమ్మద్ జోయిబ్ పాత నేరస్తుడు. ఇతనిపై మాదన్న పేట్ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్‌గా కొనసాగుతున్నాడు. ఇతనికి 11 కేసుల్లో ప్రమేయం ఉందని టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ తెలిపారు. మాదన్న పేట్ పోలీస్ స్టేషన్లో ఆగస్టు నెలలో నమోదైన నార్కోటిక్ డ్రగ్ కేసులో నిందితునిగా ఉన్నట్లు అయన తెలిపారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆనంద్ ఇంటిపై శనివారం దాడులు చేసి అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆనంద్ వద్ద నుండి 2.3 కేజీల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం మాదన్నపేట్, చాంద్రయణ గుట్ట పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఈ దాడుల్లో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫార్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.